బాలయ్య కెరీర్లో రికార్డ్ బిజినెస్

యన్.టి.ఆర్-కథానాయకుడు, యన్.టి.ఆర్-మహానాయకుడు, రూలర్.. ఇలా వరుసగా మూడు భారీ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ ఒక టైంలో. ఈ మూడు చిత్రాలు కలిపి కూడా 30 కోట్ల షేర్ రాబట్టలేకపోయాయి. దీంతో బాలయ్య పనైపోయిందనే వ్యాఖ్యలు బలంగా వినిపించాయి ఆ టైంలో. కానీ ఆ దశ నుంచి ఈ నందమూరి హీరో పుంజుకున్న తీరు అనూహ్యం.

‘అఖండ’తో బాలయ్య మామూలుగా బౌన్స్ బ్యాక్ కాలేదు. ఆ చిత్రం ఏకంగా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఆ ఊపును కొనసాగిస్తూ ‘వీరసింహారెడ్డి’ సైతం ఆ క్లబ్బులో అడుగు పెట్టింది. వరుసగా రెండు విజయాలు.. పైగా మంచి లైనప్ సెట్ కావడంతో బాలయ్య కెరీర్లో మళ్లీ పీక్స్‌ను చూస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా కావడంతో ‘భగవంత్ కేసరి’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇప్పటిదాకా ‘భగవంత్ కేసరి’ నుంచి వచ్చిన ప్రోమోలన్నీ ఆకట్టుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఫలితంగా సినిమాకు బిజినెస్ ఆఫర్లు కూడా మంచి స్థాయిలోనే వచ్చాయి. విడుదలకు రెండు నెలల ముందే బిజినెస్ దాదాపు క్లోజ్ అయినట్లు సమాచారం. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బాలయ్య హైయెస్ట్ నంబర్స్ నమోదయ్యాయి.

వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి రూ.75 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాం ఏరియా హక్కులు రూ.22 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.9 కోట్లు పలకగా.. ఆంధ్రాలో మిగతా అన్ని ఏరియాలకు కలిపి రూ.30 కోట్లకు పైగానే బిజిెస్ జరిగినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లు, ఓవర్సీస్ రైట్స్ కూడా కలిపితే లెక్క రూ.75 కోట్లు దాటేసింది.  దసరా పండక్కి ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘లియో’ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘భగవంత్ కేసరి’నే అవుతుందని.. సినిమాకు మంచి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమీ కాదని బయ్యర్లు భావిస్తున్నారు.