ఏంటి జోక్ చేస్తున్నారా.. ఇవి రీరిలీజా

గంపగుత్తగా వస్తున్న రీ రిలీజుల దెబ్బకు ఫ్యాన్స్ సైతం బాబోయ్ అనుకునే పరిస్థితి తలెత్తుతోంది. అసలు విడుదలైన టైంలో డిజాస్టర్లుగా పేరు తెచ్చుకున్న వాటిని సైతం వదలకుండా సోషల్ మీడియాని వాడుకుని మరీ ప్రోమోట్ చేస్తున్న తీరు ఉదయం ఆటలను హౌస్ ఫుల్స్ చేయిస్తోంది. ముఖ్యంగా ఆరంజ్ కు వచ్చిన రెస్పాన్స్ ఈ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. తాజాగా యోగికి వచ్చిన స్పందన చూస్తుంటే ఆమ్మో అనిపించకమానదు. అయితే అందరు స్టార్ హీరోలకు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా ఫ్లాపే అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు.

కొన్ని నెలల క్రితం ఆంధ్రావాలాని ఇలాగే క్యాష్ చేసుకోబోయి బయ్యర్లు భంగపడ్డారు. అదే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మీద రికార్డుల వర్షం కురిసింది. కాబట్టి టైమింగ్ తో పాటు కంటెంట్ కూడా కీలకం. త్వరలో బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలను పునః విడుదల చేయబోతున్నట్టు పలు ట్విట్టర్ హ్యాండిల్స్ లో కనిపించడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఇవి మాములు ఫ్లాప్స్ కావు. కనీసం పాటలు బాగున్నా ఏదో ఎంజాయ్ చేయడం కోసం చూడొచ్చులే అనుకోవచ్చు. కానీ ఏ రకంగా చూసినా ఆ అర్హత లేని వాటికి థియేటర్లకు దింపడం అన్యాయమే.

చెన్నకేశవరెడ్డిని ఎంజాయ్ చేశారు. నరసింహనాయుడు, సింహాకి కొత్త అనుభూతి చెందారు. ఇలాంటి హిట్ మూవీస్ ని తీసుకురావడం ఎంతైనా స్వాగతించాల్సిన విషయమే. భైరవ ద్వీపం అన్నారు కానీ ఇంకా మోక్షం దక్కలేదు. ఇవే కాదు ఆదిత్య 369, మంగమ్మ గారి మనవడు, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఉండగా పనిగట్టుకుని లయన్, ఒక్క మగాడు ఎందుకనేది మూవీ లవర్స్ ప్రశ్న. ఇది నిజం కాకపోతే బాగుండని అందరూ కోరుకుంటున్నారు. ఈ లెక్కన మృగరాజు, సరదాబుల్లోడు, భాయ్ లాంటివి కూడా వదిలి భయపెడతారేమో బయ్యర్లు.