సీతారామం హీరోకి మళ్ళీ సుడి తిరుగుతుందా  

మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ వచ్చే వారం 24న కింగ్ అఫ్ కోతగా రాబోతున్నాడు. మలయాళంలో విపరీతమైన అంచనాల మధ్య కెజిఎఫ్ రేంజ్ లో దీని మీద ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు . ఇతర భాషల్లో ఆ స్థాయి హైప్ లేనప్పటికీ ట్రైలర్ చూశాక కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపించడంతో పక్క రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమే. పైగా వేరే రిలీజులు ఉంటాయనే ఉద్దేశంతో ఒక రోజు ముందు గురువారమే వస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. ఐశ్యర్య మీనన్ హీరోయిన్ గా నటించగా మిగిలిన క్యాస్టింగ్ మనకు తెలియని ముఖాలే.

హైప్ సంగతి పక్కనపెడితే దుల్కర్ సుడి మాములుగా లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో వరస సక్సెస్ లతో మాంచి ఊపు మీదున్నాడు. మహానటి, సీతా రామం లాంటి స్ట్రెయిట్ మూవీస్ బ్లాక్ బస్టర్ అయితే, కనులు కనులు దోచాయంటే, కురుప్ లు కమర్షియల్ గా బాగా పే చేసిన నిర్మాతల జేబులు నింపాయి. ఒక్క హే సినామిక మాత్రమే తేడా కొట్టింది. అది కూడా ఓటిటి కోసం తీసి హఠాత్తుగా థియేటర్లలో వదలడం వల్ల జనాలకు ఎక్కలేదు. ఈ నేపథ్యంలో కింగ్ అఫ్ కోత మీద పాజిటివ్ వైబ్రేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఇటీవలే నాని,రానాను తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు

అసలే డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ లో పునఃవైభవం వచ్చినట్టు కనిపిస్తోంది. జైలర్ నాలుగింతలు లాభం తెచ్చింది. లియోని ఇరవై ఒక్క కోట్లకు కొన్నారు. మన ఆడియన్స్ కి బాషా భేదాలు ఉండవు కాబట్టి కంటెంట్ బాగుంటే హీరో ఎవరని చూడకుండా పట్టం కట్టేస్తారు. దుల్కర్ అంటే అసలే సాఫ్ట్ కార్నర్ ఉన్న మన ప్రేక్షకులు కొత్త మూవీ వచ్చిన ప్రతిసారి డీసెంట్ ఆక్యుపెన్సీలు ఇస్తున్నారు. అయితే కింగ్ అఫ్ కోత కథపరంగా మరీ కొత్తగా అనిపించడం లేదు కానీ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే మాత్రం పుష్ప రేంజ్ లో ఏదో మాస్ స్టఫ్ అయితే ఇస్తున్నారు. చూద్దాం ఏ మేరకు కనెక్ట్ అవుతుందో