6 వారాల ముందే ప్రీమియర్లు ఏంటయ్యా

పైకి ఎన్ని మాటలు చెబుతున్నా చూసుకొని మరీ ప్రభాస్ తో క్లాష్ కి సిద్ధపడుతున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా ది వ్యాక్సిన్ వార్ సెప్టెంబర్ 28 విడుదల కానుంది. అదే రోజు సలార్ ఏ రేంజ్ రిలీజ్ కు రెడీ అవుతోందో తెలిసిందే. గతంలో రాధే శ్యామ్ వచ్చిన రోజే తన ది కాశ్మీర్ ఫైల్స్ ని దింపి విజయం సాధించినట్టు ఫీలైన ఈ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని ఎదురు చూస్తున్నాడు. అయితే ఈసారి డైనోసార్ లాంటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ని మర్చిపోతున్నాడని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారి ఓవర్ కాన్ఫిడెన్స్ నెగ్గదుగా.

ట్విస్ట్ ఏంటంటే ది వ్యాక్సిన్ వార్ ప్రీమియర్లు అమెరికాలో నిన్నటి నుంచే మొదలైపోయాయి. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 4 దాకా ఇండియా ఫర్ హ్యుమానిటీ వార్ పేరుతో షోలు వేయబోతున్నారు. డల్లాస్, హౌస్టన్, డెన్వర్, సాన్ జోస్, లాస్ ఏంజిల్స్, చికాగో, అట్లాంటా, డిసి, రాలే, న్యూ జెర్సీ, న్యూ యార్క్ లో ఈ స్క్రీనింగ్స్ ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానితులు, నిర్వాహకులను సంప్రదించిన వాళ్లకు మాత్రమే టికెట్లు, పాసులు ఇస్తారు. ధర వగైరా వివరాలన్నీ వాటి ద్వారానే. నిన్న ఎలాగూ షో జరిగింది కానీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన రిపోర్ట్స్, రివ్యూస్ ఇంకా బయటికి రాలేదు.

ఎంత నమ్మకం ఉన్నా సరే ఇలాంటి సీరియస్ కాన్సెప్ట్ ఉన్న మూవీని ఏకంగా సలార్ కు ఎదురుగా తీసుకెళ్లడం అవసరం లేని రిస్కే. పైగా కరోనా తాలూకు గాయాలను మళ్ళీ తెరపై డబ్బులిచ్చి చూసేందుకు ఆడియన్స్ ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది అనుమానమే. కాశ్మీర్ ఫైల్స్ అంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం విషాదం కాబట్టి సానుభూతితో కనెక్ట్ అయ్యారు. కానీ వ్యాక్సిన్ వార్ కు ఆ ఛాన్స్ లేదు. ప్రమోషన్లు కూడా ఓవర్సీస్ నుంచి మొదలుపెడుతున్న వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ తో పోలిస్తే తనది చాలా చిన్న సినిమా అని డాబులు పోతూనే మరోవైపు తగ్గేదేలే అంటూ కవ్విస్తున్నాడు.