విక్రమ్ హ్యాంగోవర్లో లియో దర్శకుడు

స్టయిలిష్ హీరోయిజంతో కొత్త జనరేషన్ ని ఆకట్టుకుంటున్న సౌత్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ టాప్ ఫైవ్ లో ఉన్న మాట వాస్తవం. ఖైదీతో మొదలైన ఇతని విజయయాత్ర మాస్టర్ తో అగ్ర తాంబూలం అందుకుంది. ఇక రిటైర్ అయిపోతారేమో అనుకుంటున్న కమల్ హాసన్ ని గత ఏడాది విక్రమ్ తో ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్బులో చేర్పించడం ఇతనికే చెల్లింది. అందుకే విజయ్ తో లియో ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. తెలుగు డబ్బింగ్ హక్కులే ఏకంగా ఇరవై ఒక్క కోట్లకు అమ్ముడుపోవడం ఇప్పటిదాకా విజయ్ కెరీర్ లో ఎప్పుడూ జరగలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ క్యారెక్టర్ ఇంట్రోల కోసం వదులుతున్న టీజర్లు చూస్తుంటే లోకేష్ ఇంకా విక్రమ్ హ్యాంగోవర్లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ వీడియో ఇదే అనుమానం రేపుతోంది. అచ్చం రోలెక్స్ పాత్ర పోషించిన సూర్య తరహాలో ఓ ఖరీదైన వింటేజ్ కారులో వందలాది అనుచరుల మధ్య రావడం, దిగగానే ఒకడి చేతిని నరుకుతూ వాడు కేకలు పెడుతుండగా క్రూరంగా ఒక డైలాగు చెప్పడం అంతా అదే ఫార్మాట్ లో సాగింది. ఇది చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారేమో కానీ ఇదేంటి ఎక్కడో చూసినట్టు ఉందేనని వెంటనే గుర్తు చేసుకోలేకపోతున్నారు.

ఎలివేషన్లే నయా సక్సెస్ ఫార్ములాగా మారిన ట్రెండ్ లో మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేస్తే ఏదో నాడు బ్రేక్ పడక తప్పదు. ఆ మధ్య సంజయ్ దత్ పరిచయం కూడా ఇలాగే చేశారు. లోకేష్ మల్టీవర్స్ పేరుతో తాను డీల్ చేసిన హీరోలందరినీ ఒక కామన్ పాయింట్ ద్వారా భవిష్యత్తులో వచ్చే ఓ సినిమా ద్వారా కలపాలని చూస్తున్న లోకేష్ దానికి తగ్గట్టే కథలు రాసుకుంటున్నాడు. లియో ఆల్రెడీ రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ట్రైలర్ వచ్చే టైంకి అధికారికంగా ప్రకటించే సూచనలున్నాయి. అది చూశాక లోకేష్ చూపించబోయే అసలైన కంటెంట్ ఏముందో అర్థమవుతుంది.