ప్రభాస్‌ను తక్కువ అంచనా వేస్తున్నారా?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు చిత్రాలూ నిరాశ పరిచిన మాట వాస్తవం. ‘సాహో’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని.. వీకెండ్ తర్వాత నిలబడలేక అంతిమంగా డిజాస్టర్ అయింది. ‘రాధేశ్యామ్’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ‘ఆదిపురుష్’ సైతం ‘సాహో’ తరహాలోనే వీకెండ్ వరకు ఊపు చూపించి తర్వాత డౌన్ అయింది. ఈ మూడింట్లో ఏదీ ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ సినిమా కాదు.

‘బాహుబలి’ తర్వాత శిఖర స్థాయికి చేరిన ప్రభాస్ ఇమేజ్‌ను ఈ మూడు సినిమాలూ మ్యాచ్ చేయలేకపోవడం మైనస్ అయింది. ఐతే వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చినా ప్రభాస్ క్రేజ్ ఏమీ పడిపోలేదు. మార్కెట్ కూడా పెద్దగా దెబ్బ తినలేదు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’ చిత్రాల బడ్జెట్లు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్లు మామూలుగా లేవు. ఆ సినిమాల చుట్టూ ఉన్న యుఫోరియా అసాధారణ స్థాయిలో కనిపిస్తోంది. ఐతే ప్రభాస్ గత చిత్రాల ఫలితాలను చూసి అతడి బాక్సాఫీస్ స్టామినాను తక్కువ అంచనా వేస్తే అది పొరపాటే అవుతుంది.

గత ఏడాది ‘రాధేశ్యామ్’ రిలీజైన టైంలోనే ‘కశ్మీర్ ఫైల్స్’ను విడుదల చేసి భారీ విజయాన్నందుకున్నాడు బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి. ఐతే ‘రాధేశ్యామ్’ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం సరిపడని ఒక లవ్ స్టోరీ. ఆ సినిమాకు ముందు నుంచే హైప్ లేదు. సినిమా కూడా బాలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ‘కశ్మీర్ ఫైల్స్’ సక్సెస్ కావడం కూడా అనూహ్యంగా జరిగిందే. అంతమాత్రాన ప్రభాస్ తగ్గిపోడు. వివేక్ అగ్నిహోత్రి తన గురించి తాను ఎక్కువ ఊహించుకున్నా కష్టమే. కానీ అతను మాత్రం ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’కు పోటీగా తన కొత్త మూవీ ‘వాక్సిన్ వార్’ను రిలీజ్ చేస్తానని.. మరోసారి ప్రభాస్ మీద పైచేయి సాధిస్తానని ఇంతకుముందే గొప్పలు పోయాడు.

ఇప్పుడు అన్న ప్రకారమే.. ‘సలార్’కు పోటీగా సెప్టెంబరు 28న ‘వాక్సిన్ వార్’ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కానీ ‘కశ్మీర్ ఫైల్స్’ లాగా ‘వాక్సిన్ వార్’ మ్యాజిక్ చేయడం కష్టమే అన్నది విశ్లేషకుల మాట. పైగా ‘సలార్’కు హైప్ మామూలుగా లేదు. ఇక్కడ ప్రభాస్‌.. ప్రశాంత్ నీల్‌తో కలిసి వస్తున్నాడు. ఈసారి తేడాలు జరిగే అవకాశమే లేదు. డైనోజర్‌.. వాక్సిన్లను తొక్కుకుంటూ పోవడం గ్యారెంటీ అని.. ఇది వివేక్‌కు మరిచిపోలేని గుణపాఠం అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో?