ఇది కదయ్యా రజనీ నీ విశ్వరూపం

రజనీకాంత్ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో  థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం చూసి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. 2.0 బాగానే ఆడినప్పటికీ కమర్షియల్ లెక్కలతో పాటు టాక్ పరంగా దానికి వచ్చిన మిశ్రమ స్పందన బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. పెద్దన్న, కాల, కబాలి, పేట అన్నీ బోల్తా కొట్టినవే. రోబో తర్వాత సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గ బొమ్మ ఏపీ తెలంగాణలో పడలేదని బాధ పడుతూ వచ్చిన తలైవా కోలీవుడ్ ఫ్యాన్స్ ఆకలి తీరేలా జైలర్ వీరవిహారం అన్ని చోట్లా కొనసాగుతోంది. నాలుగో రోజు ఆదివారం దాదాపు ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

అగ్రిమెంట్ల ప్రకారం భోళా శంకర్ కు రిజర్వ్ చేసిన థియేటర్లను సైతం ఆగస్ట్ 15 నేషనల్ హాలిడేని దృష్టిలో ఉంచుకుని జైలర్ కే ఇచ్చేస్తున్న ఉదంతాలు ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో కనిపిస్తున్నాయి . ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఒక డబ్బింగ్ మూవీ టికెట్ల కోసం ఈ స్థాయిలో డిమాండ్ చూడలేదని మల్టీప్లెక్సుల మేనేజర్లు అంటున్నారు. దీన్ని బట్టే జైలర్ ఏ స్థాయిలో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇటు మాస్ సెంటర్స్ లోనూ ఇదే ఊచకోత కనిపిస్తోంది. కనీసం ఇంకో పది రోజులు ఇదే తరహాలో కలెక్షన్లు స్టడీగా ఉండటం ఖాయమే.

మొత్తం మూడు రోజులకు 13 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసిన జైలర్ వీకెండ్ రాకముందే 12 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటేసి బయ్యర్లను లాభాల దిశగా తీసుకెళ్తోంది. సన్ పిక్చర్స్ డీసెంట్ బిజినెస్ చేయడంలో ప్రాఫిట్ పర్సెంటెజ్ భారీగా ఉండబోతోంది. ఫుల్ రన్ లో పాతిక కోట్లకు పైగా షేర్ ని సులభంగా అందుకుంటుందని ఒకవేళ ముప్పై దాటినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని డిస్ట్రిబ్యూటర్ల టాక్. ఒకవైపు భోళా శంకర్ పరిస్థితి తీసికట్టుగా మారడంతో జైలర్ కు పడ్డ సండే ఓవర్ ఫ్లోస్ చిరు మూవీకి ఉపయోగపడ్డాయి. మొత్తానికి రజని ఇదయ్యా నీ విశ్వరూపం అనిపించుకునేలా వీరవిహారం కొనసాగిస్తున్నాడు.