కంటెంట్ కన్నా కాంబినేషన్లు నమ్ముకుంటే ఎలా

టాలీవుడ్ ప్రామిసింగ్ నిర్మాతగా కనిపించే వాళ్లలో అనిల్ సుంకర ఒకరు. కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నా ఏనాడూ అతి దూకుడుతనం ఆయనలో కనిపించదు. పైగా తనవైపు తప్పుంటే ఓపెన్ గా ఒప్పుకుని తర్వాత సరిచేసుకుంటానని మీడియా ముందే చెప్పేస్తారు. సినిమాకు సంబంధం లేని ఇతర బిజినెస్ వ్యవహారాల్లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఋజువు చేసుకున్న ఈయన గత కొంత కాలంగా కంటెంట్ కంటే ఎక్కువగా కాంబినేషన్ల ట్రాప్ లో పడి విపరీతంగా నష్టపోతున్న వైనం అయ్యో అనిపించేలా ఉంది. ఇలా జరగడం ఇది మూడోసారి.

భోళా శంకర్ ఏమయ్యిందో కళ్లముందు కనిపిస్తోంది. రిలీజ్ కు ముందు చాలా ధీమాగా కనిపించిన ఆయన్ని చూసే ఫ్యాన్స్ ఎంతో కొంత నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడిది ఆచార్యను తలదన్నే ఫలితం అందుకుంటోంది. మెగాస్టార్ స్క్రీన్ మీద ఉంటే చాలు జనం ఎగబడి చూస్తారనే లెక్క పూర్తిగా తప్పింది. అంతకు ముందు ఏజెంట్ ది మరో విషాద గాథ. అఖిల్ సురేందర్ రెడ్డి కలయికనగానే స్క్రిప్ట్ చేతిలో పూర్తిగా లేకపోయినా సరే సెట్స్ పైకి తీసుకెళ్ళి చేతులు కాల్చుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ బహిరంగంగా ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పడం ఈ మధ్య కాలంలో దీనికే జరిగింది

శర్వానంద్, సిద్దార్థ్ మల్టీ స్టారర్ పేరుతో ఆరెక్స్ 100 అజయ్ భూపతి తీసిన మహా సముద్రం నిజంగానే సముద్రంలో కలిసిపోయే ఫలితాన్ని తీసుకొచ్చింది. దీనికి అనిల్ సుంకర పెట్టిన ఖర్చు చిన్నదేమీ కాదు. కనీసం బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఒక టైంలో దర్శకుడిగా అల్లరి నరేష్ తో యాక్షన్ 3D తీసి ఫెయిలైన అనిల్ సుంకర మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో ట్రాక్ లో పడ్డారనుకుంటే ఇప్పుడు హ్యాట్రిక్ పరాజయాలు ఆలోచనలో పడేశాయి. సమర్పకుడిగా వ్యవహరించిన సామజవరగమన బ్లాక్ బస్టర్ సాధించడం ఒకటే అనిల్ కు దక్కిన ఊరట. ప్రెజెంటర్ గా మరో చిత్రం ఊరిపేరు భైరవకోన రిలీజ్ కు రెడీగా ఉంది