పాపం ఆ నిర్మాత

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మంచి నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ఒక సినిమాకు ఒక కాంబినేషన్ కుదిరిందంటే.. ఎంత బడ్జెట్లో చిత్రాన్ని పూర్తి చేస్తే వర్కవుట్ అవుతుందనే లెక్క ఒకటుంటుంది. ఆ పరిధిలోనే సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఎవ్వరైనా. కానీ అనిల్ మాత్రం అలా లెక్కలేసుకుని సినిమా చేసే రకం కాదు. సినిమాకు అవసరం అనిపిస్తే హీరోలు, దర్శకుల మార్కెట్ స్థాయిని మించి ఖర్చు చేయడానికి వెనుకాడరు.

అనిల్ ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే.. కాంప్రమైజ్ అనే మాటే ఉండదని ఆయనతో కలిసి పని చేసిన వారు చెబుతుంటారు. ఇంత ఉదారంగా వ్యవహరించే నిర్మాతకు పాపం షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ‘భోళా శంకర్’ రూపంలో ఆయనకు తగిలిన తాజా దెబ్బ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉండటం బాధాకరం.

గత రెండేళ్ల వ్యవధిలో అనిల్‌కు తగిలిన దెబ్బలు మామూలువి కావు. 2021 దసరాకు ఆయన్నుంచి ‘మహాసముద్రం’ సినిమా వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అజయ్ భూపతిని పెట్టి మంచి బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించారు అనిల్. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దారుణమైన ఫలితం అందుకుని అనిల్‌కు పెద్ద నష్టాన్నే మిగిల్చింది. దీని తర్వాత అనిల్ నుంచి వచ్చిన ‘ఏజెంట్’ సంగతి తెలిసిందే. ఏకంగా 80 కోట్లు ఖర్చు పెడితే అన్ని రకాల హక్కులు కలుపుకుని అందులో మూడో వంతు కూడా వెనక్కి రాలేదు.

టాలీవుడ్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. దెబ్బకు ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పెద్ద పంచాయితీ తప్పలేదు. దీంతో ‘భోళా శంకర్’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారాయన. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు నుంచి వస్తున్న ఈ సినిమాతో ‘ఏజెంట్’ నష్టాలు కొంతమేర భర్తీ చేసుకుందామని అనుకున్నారు. కానీ పాత నష్టాలు భర్తీ చేయకపోగా.. కొత్తగా భారీ నష్టాలే తెచ్చిపెట్టేలా ఉంది ఈ చిత్రం. ఈ సంక్షోభ స్థితి నుంచి ఆయన ఎలా బయటికి వస్తారన్నది అర్థం కావడం లేదు.