తమిళ హీరోల్లో చాలామందికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తమిళ అనువాదాలకు మంచి వసూళ్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ మార్కెట్ పెరగాలని.. భారీ వసూళ్లు రావాలని కోరుకునే తమిళ హీరోల్లో చాలామంది తెలుగు రాష్ట్రాలకు వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేయరు. తెలుగు మార్కెట్లో ఎవ్వరూ అందుకోని స్థాయిని అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం చాలా కొన్ని సినిమాలను మాత్రమే తెలుగులో ప్రమోట్ చేశాడు.
రజినీ గత సినిమాలతో పోలిస్తే హైప్ తెచ్చుకున్న జైలర్‌కు అయినా తెలుగులో ఒక ఈవెంట్ చేస్తారేమో.. రజినీ వస్తాడేమో అని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. రిలీజ్‌కు ముందే కాదు.. తర్వాత కూడా సూపర్ స్టార్ ఇక్కడికి రాడనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ విషయమై జైలర్ తెలుగు డిస్ట్రిబ్యూలర్లలో ఒకడైన దిల్ రాజు స్పందించాడు.
జైలర్‌కు తెలుగులో కూడా తొలి రోజు మంచి ఆక్యుపెన్సీలు రావడం.. ఓపెనింగ్స్ కూడా అంచనాలను మించి వచ్చేలా కనిపిస్తున్న నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడాడు. రజినీతో ఈవెంట్ చేయించడానికి రిలీజ్ ముంగిట ప్రయత్నం చేశామని.. ఐతే తమిళంలో కాకుండా ప్రమోషన్లు చేస్తే అన్ని భాషల్లోనూ చేయాలని.. లేదంటే అన్ని చోట్లా ఈవెంట్లు క్యాన్సిల్ చేసుకోవాలని రజినీ అనుకున్నారని.. టైం లేకపోవడం వల్ల ఎక్కడికీ ఆయన వెళ్లలేదని రాజు తెలిపాడు.
సినిమా రిలీజ్ టైంకి రజినీ హిమాలయాలకు వెళ్లిపోయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ లాంటి వాటికి కూడా ఆయన రారని రాజు తేల్చేశాడు. తొలి రోజు మధ్యాహ్నం నుంచే జైలర్‌కు థియేటర్లు పెరిగాయని.. ఐతే ఆగస్టు 15 వరకు చిరంజీవి సినిమా భోళా శంకర్‌కే ప్రాధాన్యం ఉంటుందని.. తర్వాత పరిస్థితిని బట్టి థియేటర్ల సర్దుబాటు ఉంటుందని రాజు చెప్పాడు.