పవన్ సినిమాపై క్రిష్ క్లారిటీ

‘అజ్ఞాతవాసి’ తర్వాత రెండేళ్ల పాటు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక దశలో పవన్ తీరు చూస్తే మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా కనిపించింది. కానీ ఎన్నికలు అయిన ఆర్నెల్ల తర్వాత ఆయన మనసు మారింది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.

ఐతే సినిమాలకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. రాజకీయాల్లో కొనసాగుతూనే రెండేళ్ల వ్యవధిలో వీలు చిక్కినపుడల్లా షూటింగ్‌కు సమయం కేటాయిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే ముందుగా ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టి శరవేగంగా సినిమాను పూర్తి చేయాలని చూశాడు. కానీ కరోనా వచ్చి ఆయన ప్రయత్నానికి అడ్డం పడింది. మరోవైపు ఒక షెడ్యూల్ తర్వాత క్రిష్ సినిమా కూడా ఆగిపోయింది.

ఇప్పుడిక పవన్ ఎప్పుడు మళ్లీ షూటింగ్‌కు వస్తాడో.. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలా డేట్లు కేటాయిస్తాడో అర్థం కాకుండా ఉంది. మరోవైపు క్రిష్ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. దీంతో పవన్‌తో క్రిష్ సినిమా మీద అయోమయం నెలకొంది. ఈ విషయమై తాజాగా మీడియాకు సమాచారం ఇచ్చాడు క్రిష్.

తనతో పవన్ చేస్తున్న సినిమా విషయంలో తొందర లేదని.. ఆయన ముందు ‘వకీల్ సాబ్’ పూర్తి చేయాలని.. ఆ తర్వాత వీలు చూసుకుని తమ సినిమాను పున:ప్రారంభిస్తామని క్రిష్ వెల్లడించాడు. ఈ లోపు తాను వైష్ణవ్ సినిమాను పూర్తి చేస్తానన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా పవన్‌తో క్రిష్ సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణే.. వైష్ణవ్-క్రిష్ సినిమాకు కూడా పని చేయనున్నాడన్నది తాజా సమాచారం.