మెగాస్టార్ చిరంజీవి 2007లో ‘శంకర్ దాదా జిందాబాద్’తో సినిమాల నుంచి బ్రేక్ తీసుకునే వరకు టాలీవుడ్లో ఆయన మకుటం లేని మహారాజు. చిరు ఎలాంటి సినిమా చేసినా సరే.. రిలీజ్ ముంగిట యుఫోరియానే వేరుగా ఉండేది. చిరు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్ సంపాదించడం అప్పటికి పెద్ద టాస్కులా ఉండేది. ఆయన పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయానికి ఆన్ లైన్ బుకింగ్స్ వచ్చేసి.. టికెట్ల కోసం థియేటర్ల ముందు చొక్కాలు చించుకోవాల్సిన, లాఠీ దెబ్బలు తినాల్సిన కష్టం తప్పింది.
అయినా సరే.. ఆన్ లైన్లో టికెట్ సంపాదించడం అంత తేలిక కాదన్న పరిస్థితే ఉంది. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ సినిమాలకు హైప్ దృష్ట్యా తొలి రోజు షోలకు కొన్ని గంటల్లో టికెట్లు అయిపోయాయి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలకు హైప్ కొంచెం తగ్గినా.. బుకింగ్స్ బాగానే జరిగాయి. కానీ ‘వాల్తేరు వీరయ్య’కు మళ్లీ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. సంక్రాంతి రిలీజ్ కావడం దానికి పెద్ద ప్లస్ పాయింట్.
‘వాల్తేరు వీరయ్య’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరు సినిమా అంటే అంచనాలు ఎక్కువే ఉండాలి. కానీ ఒక రొటీన్ మాస్ సినిమాకు రీమేక్ కావడం, పైగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడం వల్ల ‘భోళా శంకర్’పై అంచనాలు పెద్దగా లేవు. అయినా సరే.. చిరు చరిష్మా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరుగుతాయని అనుకున్నారు. కానీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. హైదరాబాద్ సిటీలో బుకింగ్స్ ఓపెన్ అయిన ఐదారు రోజుల తర్వాత కూడా ఫుల్ కాని షోలు వందల్లో ఉన్నాయి.
ఫుల్ అయిన షోలు చాలా తక్కువగా కనిపిస్తుున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ‘భోళా శంకర్’ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఇలాంటి సినిమాకు 330 పెట్టి టికెట్ బుక్ చేసుకుని ఏం వెళ్తాం అన్నట్లు ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్లలో పరిస్థితి మెరుగే కానీ.. వాటిలోనూ ఫుల్ అయిన షోలు తక్కువే. ఇన్నేళ్ల ఉజ్వల కెరీర్లో ఇంత లో బజ్ ఉండి, టికెట్ల కోసం ఇంత తక్కువ డిమాండ్ ఉన్న సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి లేదు.