పాన్ ఇండియా రిలీజ్.. డ‌బ్బుల కోసం కాద‌ట‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ఆల్రెడీ పాన్ ఇండియా రిలీజ్ ప్ర‌య‌త్నాలు చేసి దెబ్బ తిన్నాడు. అర్జున్ రెడ్డి తెలుగు వెర్ష‌నే వివిధ భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని త‌న‌కు కొంచెం ఫాలోయింగ్ తెచ్చి పెట్ట‌డంతో డియ‌ర్ కామ్రేడ్ ద‌క్షిణాది భాష‌ల‌న్నింట్లో రిలీజ్ చేసి చూశాడు. కానీ ఆ సినిమా తేడా కొట్టేసింది. తెలుగులోనే డిజాస్ట‌ర్ అయిన డియ‌ర్ కామ్రేడ్.. ఇత‌ర భాష‌ల్లో క‌నీస ప్ర‌భావం కూడా చూప‌లేదు.

ఆ త‌ర్వాత లైగ‌ర్ రూపంలో ప్రాప‌ర్ పాన్ ఇండియా సినిమా చేశాడు. నార్త్ మార్కెట్లో పెద్ద స్థాయిలో రిలీజైంది ఈ చిత్రం. కానీ ఈ సినిమా ఇంకా పెద్ద డిజాస్ట‌ర్ అయి విజ‌య్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. అయినా విజ‌య్ త‌గ్గ‌ట్లేదు. త‌న కొత్త చిత్రం ఖుషిని పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయిస్తున్నాడు. కానీ ఈ సినిమా ఏమాత్రం ప్ర‌భావం చూపుతుందో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

ఖుషి ట్రైల‌ర్ చూడ‌టానికి బాగానే ఉంది. కానీ అదొక స‌గ‌టు ల‌వ్-ఫ్యామిలీ డ్రామాలా క‌నిపిస్తోందే త‌ప్ప.. ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించే యునీక్ క్వాలిటీ కానీ.. భారీత‌నం కానీ..వైవిధ్యం కానీ క‌నిపించ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలోనే ఖుషి మ‌ల్టీ లాంగ్వేజ్ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఇత‌ర భాష‌ల జ‌ర్న‌లిస్టులు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌డం గురించి సందేహాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌శ్న‌లు అడిగారు.

దీనికి బ‌దులిస్తూ.. ఈ సినిమాను ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ చేయ‌డం డ‌బ్బుల మీద ఆశ‌తో కాద‌ని విజ‌య్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. మామూలుగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ‌య్యే తెలుగు చిత్రాల్లో భారీత‌నం, యాక్షన్ ఉంటుంద‌ని.. కానీ ఖుషిలో అన్ని భాష‌ల వాళ్ల‌కూ క‌నెక్ట‌య్యే ఎమోష‌న్లు, ఫీల్ ఉంటాయ‌ని.. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నామ‌ని విజ‌య్ తెలిపాడు. మ‌రి ఖుషి ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ఏమేర ఆక‌ర్షిస్తుందో, ఆక‌ట్టుకుంటుందో చూడాలి.