ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా అంతటా ప్రభాస్ కొత్త చిత్రం గురించే చర్చంతా. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరు సినీ ప్రియులూ ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ‘తానాజీ’ దర్శకుడు ఓమ్ రౌత్‌తో ప్రభాస్ జట్టు కట్టబోతున్నాడని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘ఆది పురుష్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు కూడా బయటికి వచ్చాయి.
ఇది బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమా. ప్రభాస్ తొలి బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. దాన్ని కేవలం హిందీలో తీసి మిగతా భాషల్లాగే తెలుగులోనూ అనువాదం చేయాలని అనుకోవట్లేదు. ప్రభాస్ సొంత భాషను విస్మరిస్తే అతడి ఫ్యాన్స్ కచ్చితంగా ఫీలవుతారు. అందుకే పక్కా తెలుగు సినిమా అనిపించేలా ప్రతి సన్నివేశాన్నీ తెలుగులో తీయబోతున్నారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రం అనువాదమే చేయబోతున్నారు. మరికొన్ని అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుందని సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్‌తో కలిసి భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. ఆయన ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’తో పాటు ‘రాధేశ్యామ్’ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. ‘ఆది పురుష్’ బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటే అని సమాచారం. ‘రామాయణం’ కథకు ఇది అడాప్షన్ అని.. చెడు మీద మంచి విజయం సాధించడం అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఇది సాగుతుందని దీని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.
రాముడు, రావణుడు, ఆంజనేయుడు పాత్రలు టైటిల్ పోస్టర్లో కనిపించాయి. ఆ పురాణ పురుషుల్ని తలపించే పాత్రలు సినిమాలో కనిపిస్తాయి. ప్రభాస్‌ది రాముడి తరహా పాత్ర అన్నది స్పష్టం. మరి రావణుడెవరన్నది ఆసక్తికరం. ఒక బాలీవుడ్ టాప్ స్టార్‌తో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇక ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించబోతుండటం మరో విశేషం.