అల్లు శిరీష్ ఈ మధ్య సినిమాయేతర విషయంతో వార్తల్లోకి వచ్చాడు. ఏడాదికి పైగా ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్న శిరీష్.. ఈ మధ్య దేశంలో చైనా వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో అల్లు శిరీష్.. దేశీయ ఉత్పత్తుల వాడకం గురించి జనాల్లో ఒక మూమెంట్ తీసుకురావడం మీద దృష్టిసారించాడు.
పూర్తిగా చైనా, ఇతర దేశఆల ఉత్పత్తులను నివారించడం సాధ్యం కాదని చెబుతూనే.. సాధ్యమైనంతగా వాటిని తగ్గించి, దేశీయ ఉత్పత్తులు వినియోగించాల్సిన అవసరాన్ని శిరీష్ నొక్కి చెబుతున్నాడు. పతంజలి పేస్ట్ సహా తాను వాడుతున్న భారతీయ ఉత్పత్తుల వివరాలను వెల్లడించాడు. దీని మీద శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ సైతం ఒక ట్వీట్ వేసి తమ్ముడిని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.
ఐతే దీని మీద సోషల్ మీడియాలో జనాలు వేసే కౌంటర్లు, పేల్చే జోకుల గురించి ఓ ఇంటర్వ్యూలో శిరీష్ దగ్గర ప్రస్తావిస్తే.. దాని గురించి తనకు తెలుసన్నాడు. ఈ విషయంలో తనను చాలామంది కామెడీ చేశారని చెప్పాడు. సోషల్ మీడియా జనాల వరకు ఎందుకు.. తన స్నేహితులకు దేశీయ ఉత్పత్తుల వాడకం అవసరాన్ని చెబితే వాళ్లు కూడా తనను తమాషా చేశారని.. కానీ వాళ్లకు అర్థమయ్యేలా చెబితే వాళ్లూ సాధ్యమైనంతగా దేశీయ ఉత్పత్తులు వాడే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలా అందరూ కదిలితే మన ఎకానమీకి ప్రయోజనం చేకూరుతుందని అతనన్నాడు.
తాను వాడుతున్న దేశీయ ఉత్పత్తుల గురించి ట్వీట్ చేయమని తానేమీ బన్నీని కోరలేదని.. తన వదిన స్నేహకు ఫొటో పంపితే అది చూసి బన్నీ తనకు తానుగా ట్వీట్ చేశాడని.. అతను ఊరికే దేన్ని పడితే దాన్ని ప్రమోట్ చేయడని శిరీష్ అన్నాడు. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. తాను రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు అతను వెల్లడించాడు.