నెగటివ్ పాత్రలో తారక్ ఎందుకంటే

ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దీని తర్వాత వార్ 2 చేయబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కాంబినేషన్ గురించి ఊహించుకుంటేనే ఫ్యాన్స్ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు. అందులో ప్రధానమైంది తారక్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉండటం. అలా అని విలన్ కాదట. ఒక లక్ష్యంతో అలా ప్రవర్తించిన ఇతని గతానికి సంబంధించిన ఓ కీలక ఘట్టం ప్రేక్షకులు ఏ మాత్రం ఊహించే అవకాశం లేని విధంగా సర్ప్రైజ్ ఇస్తుందని అంటున్నాడు.

ఈ ఏడాది చివరిలోగానే షూటింగ్ మొదలుపెట్టుకుంటున్న వార్ 2కి సరిగ్గా  ఏడాది సమయం కేటాయించబోతున్నారు. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిలింస్ నిర్ణయించుకుంది. వచ్చే సంవత్సరం జనవరి 25కి ఫైటర్ ఉంది. ఆపై నెక్స్ట్ ఇయర్ అదే డేట్ కి తమ కొత్త స్పై మూవీని లాక్ చేస్తున్నారు. గూఢచారి సిరీస్ లో వరసగా పదికి పైగా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేసుకున్న నిర్మాత ఆదిత్య చోప్రా దానికి అనుగుణంగా వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేస్తున్నాడు. వీటిలో దీపికా పదుకునే, అలియా భట్ లు నటించే లేడీ స్పై మూవీస్ కూడా ఉండబోతున్నాయి.

జూనియర్ ని ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ కు ఎంచుకోవడానికి కారణం జై లవకుశట. అందులో కలియుగ రావణుడిగా విశ్వరూపం చూపించిన తీరు అయాన్ ని  స్పెల్ బౌండ్ చేసిందట. అందుకే ఏరికోరి మరీ ఒప్పించినట్టు వినికిడి. హృతిక్ తారక్ ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూసి ఉండరని ఇన్ సైడ్ టాక్. ఎలాగూ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో మార్కెటింగ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టే ఖర్చులో ఎక్కడా రాజీ లేకుండా బడ్జెట్ ని కేటాయించబోతున్నారు. దేవర, వార్ 2 అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో మొదలవుతుంది.