గూఢచారి-2.. రేంజే వేరు

టాలీవుడ్లో అడివి శేష్‌ది ఎంతో ఆసక్తికర, స్ఫూర్తినిచ్చే ప్రయాణం. అతను టాలీవుడ్లోకి అడుగు పెట్టింది డైరెక్టర్ కమ్ హీరోగా. ఆ చిత్రమే.. కర్మ. కానీ ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. ఆ తర్వాత తనే లీడ్ రోల్‌లో ‘కిస్’ అనే సినిమా తీస్తే అది కూడా తేడా కొట్టింది. ఈ సినిమాల మీద డబ్బులు కూడా పెట్టి నష్టపోయిన శేష్.. విధి లేని పరిస్థితుల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేశాడు. ఈ క్రమంలోనే ‘పంజా’లో తన టాలెంట్ చూపించాడు.

నెమ్మదిగా ఇండస్ట్రీలో కుదురుకుని మళ్లీ హీరోగా ‘క్షణం’ సినిమా చేశాడు. దానికి స్క్రిప్టు సమకూర్చింది కూడా అతనే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి చిత్రాలతో తన ఇమేజే మారిపోయింది. టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోస్ కమ్ స్క్రీన్ రైటర్లలో ఒకడిగా మారాడు శేష్. వరుసగా హిట్లు కొడుతున్నా హడావుడి పడకుండా.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ.. ఒక్కో ప్రాజెక్టుకు చాలా టైం కేటాయిస్తూ బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు శేష్.

శేష్ కొత్త చిత్రం గూఢచారి-2ను అనౌన్స్ చేసి చాలా నెలలైంది. దాని గురించి మరే అప్‌ డేట్ లేదు. తాజాగా ‘గూఢచారి’ విడుదలై అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా శేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాంతో పాటుగా ‘జీ2’ ‘గూఢచారి-2 గురించి కూడా మాట్లాడాడు. గూఢచారిని మించి ఉండేలా.. ట్రూలీ ఇంటర్నేషనల్ అనిపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని.. బెస్ట్ ఔట్ పుట్ కోసమని ప్రి ప్రొడక్షన్ పని పెద్ద ఎత్తున జరుగుతోందని అతను వెల్లడించాడు.

ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు వేర్వేరు దేశాల్లో జరుగుతున్నట్లు అతను వెల్లడించడం విశేషం. మిగతా వాళ్లలా పాన్ ఇండియా మూవీ అంటే తెలుగు వరకు హంగామా చేసి మిగతా భాషల్లో మొక్కుబడిగా రిలీజ్ చేసే టైపు కాదు శేష్. దీన్ని నిజమైన పాన్ ఇండియా సినిమాగా అందించాలనుకుంటున్నాడు. అలాగే థ్రిల్లర్ సినిమాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ను రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. పెద్ద నిర్మాతల చేతిలో ఈ ప్రాజెక్టు పడటం కలిసొచ్చే విషయమే. ఈ చిత్రాన్ని వినయ్ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు.