సిద్ శ్రీరామ్ గొంతులో తమన్ వేగం

మనకు తెలిసిన గాయకుడు సిద్ శ్రీరామ్ కేవలం మెలోడీ పాటలకే పరిమితం. అతని బెస్ట్ సాంగ్స్ ఏవంటే ఉండిపోరాదే, ఇంకేం ఇంకేం కావాలే, నీలి నీలి ఆకాశం, నిజమేనే చెబుతున్నా అంటూ కమ్మటి పాటలే గుర్తొస్తాయి. ఒకప్పుడు హరిహరన్, ఉన్నికృష్ణన్ తరహాలో ఒక రకమైన సాఫ్ట్ నెస్ కు పూర్తిగా అలవాటు పడిపోయాం. కానీ తమన్ ఈసారి వెరైటీతో ఫాస్ట్ బీట్ తో  ఓ పాట పాడించి మ్యూజిక్ లవర్స్ కి షాక్ ఇచ్చాడు. ఇవాళ రిలీజైన స్కంద మొదటి ఆడియో సింగల్ లో నీ చుట్టు చుట్టు తిరిగే నా గుండెనడిగినా అంటూ సాగే లిరిక్స్ లో కొత్త సిద్ శ్రీరామ్ దర్శనమిచ్చాడు. అదేనండి వినిపించాడు.

వినగానే ఎక్స్ ట్రాడినరీ అనిపించకపోయినా క్రమంగా ఎక్కేలా ట్యూన్ కంపోజింగ్ ఉంది. అసలు పేరు చెప్పకుండా వినిపిస్తే ఇది సిద్ శ్రీరామ్ అని వెంటనే గుర్తుపట్టలేనట్టుగా మిక్స్ చేశారు. రామ్, శ్రీలీల హుషారైన డాన్సులు, ఖరీదైన సెట్ నిండుదనాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా పెద్దగా హడావిడి చేయని స్కంద టీమ్ ఇవాళ ఈ పాటతోనే పబ్లిసిటీ మొదలుపెట్టింది. వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ దీని మీద బోలెడు నమ్మకంతో ఉన్నాడు. క్యారెక్టర్ కోసమే బరువు పెరిగి మరీ దర్శకుడు బోయపాటి శీను కోరుకున్న బిల్డప్ ని సెట్ చేసుకున్నాడు

సెప్టెంబర్ 15 విడుదల కాబోతున్న స్కంద ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో ఉంది. ఇంకా ఫైనల్ చేయలేదు కానీ ఏరియాల వారిగా నిర్మాత చెబుతున్న రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇంకో వారం పది రోజుల్లో బయ్యర్లు డీల్స్ ని ఫైనల్ చేసుకోబోతున్నారు. ట్రైలర్ వచ్చాక హైప్ ఇంకో లెవెల్ కు వెళ్తుందని టీమ్ నమ్మకంగా ఉంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక బోయపాటి శీను చేస్తున్న మూవీ కావడంతో మాస్ ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. టీజర్ విజువల్స్ గట్రా దానికి తగ్గట్టే అనిపిస్తున్నాయి. బడ్జెట్ పరంగా రామ్ కెరీర్ లో స్కందనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీ.