సీనియర్ హీరోలు తమ ఇమేజ్ కు తగ్గట్టు వయసు మళ్ళిన పాత్రల్లో కనిపించడం పెద్ద సవాల్. కోలీవుడ్ లో మనవడున్న తాతయ్యగా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఆడియన్స్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. హీరోయిన్ తో ఆడిపాడే డ్యూయెట్లు లేకపోయినా బ్లాక్ బస్టర్ దక్కింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే దారి పట్టారు. కోకోకోకిల, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కానుంది. అనిరుద్ సంగీతం, రజని స్టైల్, భారీ క్యాస్టింగ్, తమన్నా కావాలయ్యా పాట లాంటి బోలెడు ఆకర్షణలున్నాయి. స్టోరీకి సంబంధించిన లీకులు బయటికి వచ్చాయి.
వాటి ప్రకారం జైలర్ లో రజని పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్. రిటైర్ మెంట్ తర్వాత చెన్నైలో తన ఆరేళ్ళ మనవడితో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు. కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్. ఎవరినీ లెక్క చేయని నిజాయితీ ఉన్న ఆఫీసర్. ఒక ముఖ్యమైన కేసు విచారణలో ఉండగా ఉన్నట్టుండి మాయమవుతాడు. నెలలు గడిచినా జాడ దొరకదు. దీంతో దీనికి కారణమైన గ్యాంగ్ ని పట్టుకోవడానికి ముత్తుపాండి రంగంలోకి దిగుతాడు. ఒకప్పుడు తాను జైలర్ గా పని చేసిన అనుభవంతో దారుణమైన ఆ కిల్లర్ ముఠా జాడ కనుక్కుంటాడు. ఈ క్రమమే నెల్సన్ చాలా థ్రిల్లింగ్ గా తీశారని చెన్నై టాక్.
ఇది నిజమో కాదో కానీ లైన్ అయితే ఆడియన్స్ కి నచ్చేలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మనవడి సెంటిమెంట్ బలంగా ఉంటుందని వినికిడి. అయితే పెద్దన్నలాగా డాన్స్ చేసే పాటలు ఉండవని, కావాలయ్యా సాంగ్ కూడా చాలా కాలం తర్వాత పని మీద జైలుకు వచ్చిన రజనికి స్వాగతం చెప్పే నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. యాక్షన్ విజువల్స్ మీద ఎక్కువ ఆధారపడిన జైలర్ లో శివరాజ్ కుమార్ పదకొండు నిమిషాల స్పెషల్ క్యామియో చేయగా మోహన్ లాల్ అంతకన్నా తక్కువ నిడివిలో కనిపిస్తారట. కాకపోతే కథలో కీలకమైన మార్పులకు దారి తీసే రీతిలో పాత్రలను డిజైన్ చేసినట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates