త్వరగా చేసే వెసులుబాటు, తక్కువ ఖర్చు అనే రెండే కారణాలతో రీమేకుల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు బాక్సాఫీస్ తత్వంతో పాటు కొన్ని పాఠాలు అవగతమవుతున్నాయి. మోహన్ లాల్ కు వంద కోట్ల సినిమాగా మిగిలిపోయిన లూసిఫర్ ని ఏరికోరి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తే ప్రశంసలు వచ్చాయి కానీ రికార్డులు బద్దలు కాలేదు. అరవై కోట్ల షేర్ దాటింది తప్ప నిర్మాత చెప్పుకున్నట్టు వంద కోట్లు వచ్చిన దాఖలాలు అంతగా లేవు. అయితే స్ట్రెయిట్ కంటెంట్ తో వాల్తేరు వీరయ్యని ఎంత రొటీన్ గా తీసినా సరే సంక్రాంతి సీజన్ లో నూటా పాతిక కోట్ల షేర్ క్రాస్ చేసి సగర్వంగా నిలబడింది.
ఇంకో పది రోజుల్లో రాబోయే భోళా శంకర్ మీద ఆశించిన బజ్ కనిపించడం లేదు. వేదాళం రీమేక్ అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులకు దీని మీద ఎగ్జైట్ మెంట్ లేదు. పోనీ కథేమైనాకొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. అరిగిపోయిన మాఫియా రివెంజ్ కి సిస్టర్ సెంటిమెంట్ జోడించారు. అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే నిలబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూస్తే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు కష్టపడి గట్టెక్కాయి కానీ ఇవి రీమేక్ కాకుండా ఓజి లాంటి కొత్త కంటెంట్ అయితే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళేవన్న మాట వాస్తవం. ఇక బ్రోకు ఏం జరుగుతోందో కళ్లారా చూస్తున్నాం.
మొదటి మూడు రోజుల హడావిడి తప్ప బ్రో తర్వాత విపరీతంగా నెమ్మదించింది. సోమ మంగళవారాల డ్రాప్ విపరీతంగా ఉంది. ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనుమానమే. త్రివిక్రమ్ కలం నుంచి బ్రో ప్లేస్ లో అత్తారింటికి దారేది లాంటి పవర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ పడి ఉంటే నాన్ రాజమౌళి రికార్డులు దక్కేవన్న ఫ్యాన్స్ అభిప్రాయం తప్పేమీ లేదు. ఇంకో రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది. చిరు బ్రో డాడీ చేస్తారనే ప్రచారం గట్టిగా తిరుగుతోంది. ఒకప్పుడు హిట్లర్, ఖుషి, సుస్వాగతం లాంటి రీమేక్స్ విరగబడి ఆడాయి కానీ ఇప్పుడా ఆ పరిస్థితులు లేవని గుర్తించడం చిరు పవన్ లకు అత్యవసరం.