టాలీవుడ్లో ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రయాణం సాగిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు. ఐతే బ్రోచే వారెవరురా, రాజ రాజ చోర లాంటి మంచి సినిమాల తర్వాత అతను కొంచెం గాడి తప్పాడు. కొంచెం మాస్ స్టయిల్లో చేసిన అర్జున ఫల్గుణ, భళా తందనాన, అల్లూరి శ్రీ విష్ణును తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఆ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. దీంతో శ్రీ విష్ణు పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. కానీ ‘సామజవరగమన’ సినిమాతో శ్రీ విష్ణు బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ ఉత్సాహంలో శ్రీ విష్ణు తన హిట్ మూవీ ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ఖరారైనట్లు తాజా సమాచారం. ‘రాజ రాజ చోర’ అనే టైటిల్‌తో సంబంధం లేకుండా ‘స్వాగ్’ (SWAG) అని వేరే టైటిల్ ఖరారు చేశారట ఈ సినిమాకు.
సోషల్ మీడియా కాలంలో ‘స్వాగ్’ అనే పదం బాగా పాపులర్ అయింది. హీరోలను కొనియాడుతూ స్టైల్, గ్రేస్.. ఇలాంటి పదాలను మించి పెద్దగా వాడాలనుకున్నపుడు ‘స్వాగ్’ అని వాడుతుంటారు అభిమానులు. ఈ టైటిల్ సినిమాకు పెట్టారంటే దాని చుట్టూ ఏదో కథ ఉండే ఉంటుంది. బహుశా SWAG అనే అక్షరాలకు అబ్రివేషన్ వచ్చేలా టైటిల్ ఉండొచ్చని భావిస్తున్నారు.
‘రాజ రాజ చోర’లో బయటికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాగా కలరింగ్ ఇస్తూ దొంగతనాలు చేస్తుంటాడు హీరో. దీనికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీస్తున్నారు ఈసారి. అసలు హీరో ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందన్నది ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం. ‘రాజ రాజ చోర’తో దర్శకుడిగా పరిచయం అయిన హాసిత్ గోలినే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు పలు అవతారాల్లో కనిపించనున్నాడట. అందుకోసం డిఫరెంట్ మేకప్ ట్రై చేస్తున్నట్లు సమాచారం.