ఇలాంటి కంటెంట్‌తో ఈ వసూళ్లు గొప్పే

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రో’ సినిమాకు ఏమంత మంచి టాక్ రాలేదు. అసలీ చిత్రానికి మొదలైనప్పటి నుంచి సరైన బజ్ లేదు. పవన్ అభిమానులే ‘బ్రో’ను లైట్ తీసుకున్నారు. రిలీజ్ ముంగిట కూడా లో బజ్ కనిపించింది. బహుశా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతి తక్కువ అంచనాలతో రిలీజైన సినిమా ఇదేనేమో. ‘బ్రో’కు రిలీజ్ పరిస్థితులు కూడా ఏమంత కలిసి రాలేదు. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండటంతో థియేటర్ల సంఖ్య తగ్గింది.

షోలు కొంచెం లేటుగా మొదలయ్యాయి. టికెట్ల ధరలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయినా సరే తొలి రోజు రూ.26 కోట్లకు పైగా షేర్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. పవన్ గత సినిమాలతో పోలిస్తే వసూళ్లు కొంచెం తగ్గాయి కానీ.. రిలీజైన థియేటర్లు, టికెట్ల ధరలు, షోల సంఖ్య, ప్రి రిలీజ్ బజ్, సినిమాకు వచ్చిన టాక్.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ వసూళ్లు అంచనాలు మించి వచ్చినట్లే.

రెండో రోజు ‘బ్రో’ వసూళ్లలో డ్రాప్ కనిపించింది. మార్నింగ్ షోలు, మ్యాట్నీలకు ఆక్యుపెన్సీలు తగ్గాయి. సాయంత్రం, రాత్రి షోలకు మెజారిటీ షోలు ఫుల్ అయ్యాయి. మొత్తంగా చూస్తే వసూళ్లలో ఓ 30 శాతం వరకు డ్రాప్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆదివారం పరిస్థితి బాగుంది. ‘బ్రో’ పక్కా క్లాస్ మూవీ అయినప్పటికీ.. మాస్ సెంటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి సినిమా గ్రాస్ రూ.100 కోట్లకు చేరువ కాబోతోంది.

షేర్ రూ.55-60 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. యుఎస్‌లో ఈ సినిమా ఆదివారం మిలియన్ డాలర్ మార్కును కూడా అందుకుంది. ఇప్పటికైతే సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా బాగా పెర్ఫామ్ చేసినట్లే. కానీ ‘బ్రో’ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. రెండో వీకెండ్ అయ్యే వరకు మంచి రన్ ఉంటేనే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వస్తారు. రూ.90 కోట్ల షేర్ మార్కును టచ్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేకపోవడం ‘బ్రో’కు కలిసొచ్చే అంశం.