చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందిన భోళా శంకర్ ఆగస్ట్ 11 విడుదలకు ముస్తాబవుతోంది. నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్లను గట్టిగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న రాజు గారి తోటలో 125 అడుగుల అతి పెద్ద కటవుట్ ని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హిస్టరీలో ఇంత పొడవున్న నిలువెత్తు కటవుట్ ని ఎప్పడూ పెట్టలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యాన్స్ షేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.
గతంలో ఏజెంట్ విషయంలో అనిల్ సుంకర మరీ ఇంత పెద్దది కాకపోయినా యాభై నుంచి డెబ్భై అడుగుల కటవుట్లను పెట్టించి అక్కినేని అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు. తీరా ఫలితం ఏమయ్యిందో చూశాం. భోళా శంకర్ కు అలా జరగకూడదని సగటు మూవీ లవర్స్ కోరిక. భోళా శంకర్ కు ఇప్పటికే బోలెడు ప్రతికూలత ఉంది. ట్రైలర్ లో రొటీన్ కంటెంట్ ఉందని, శ్రీముఖితో రొమాన్స్ కామెడీ పెట్టడం అస్సలు బాలేదని, ఎంత తమ్ముడైనా సరే పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం నచ్చలేదని సీనియర్ ఫ్యాన్సే ట్విట్టర్, ఇన్స్ టాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక సగటు ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో జోష్ లో ఉన్న చిరంజీవి దీంతో మరో హిట్టు కొట్టాలనే నమ్మకంతో ఉన్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మహతి స్వర సాగర్ సంగీతం ఇలా అన్ని ఆకర్షణలు ఉన్నా మెహర్ రమేష్ దర్శకత్వం, వేదాళం రీమేక్ అనే అంశం నెగటివిటీని తెచ్చిపెట్టాయి. సో కటవుట్లు ఎంత గ్రాండ్ గా ఉన్నాయో కంటెంట్ అంతకు మించి అనేలా ఉంటే తప్ప పోటీకి దిగుతున్న రజనీకాంత్ జైలర్ ని తట్టుకోవడం ఈజీగా ఉండదు. పైగా భోళా శంకర్ పాటలు కూడా ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకోలేదు.