పూరీ సార్.. ఈ ఫైర్ అక్కడ చూపించండి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో మిగతా వాళ్లతో పోలిస్తే ఫేడవుట్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు లాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. గత దశాబ్ద కాలంలో తన కథ కాని ‘టెంపర్’లో మినహాయిస్తే తన స్థాయి చూపించలేకపోయాడు. అవే మాఫియా కథల్ని అటు తిప్పి ఇటు తిప్పి విసుగెత్తించేశాడు పూరి.

ఒక దశ దాటాక ఆయన సినిమాల్ని భరించడం చాలా కష్టం అయిపోయింది ప్రేక్షకులకు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుని ఉండొచ్చు కానీ.. నిజమైన పూరి అభిమానులకు ఆ సినిమా కూడా సంతృప్తినివ్వలేదు. పూరి కొత్త సినిమా ‘ఫైటర్’ సంగతేంటో చూడాలి.

ఐతే సినిమాల సంగతి పక్కన పెడితే కొన్ని రోజులుగా పూరి పాడ్ కాస్ట్‌లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై సూటిగా సుత్తి లేకుండా చెబుతున్న విషయాలు వావ్ అనిపిస్తున్నాయి. ప్రతి అంశంలోనూ మామూలు జనాలు ఆలోచించని కొత్త కోణాల్ని.. ఆలోచింపజేసేలా, గూస్ బంప్స్ ఇచ్చేలా చెబుతున్నారు పూరి.

ఇందులో ఆయన విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, స్పష్టత చూసి చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇక్కడ ఇంత బాగా ఆలోచించగలుగుతున్న పూరి.. తన సినిమా కథల విషయంలో ఎందుకు వైవిధ్యం చూపించలేకపోతున్నారు.. ఆ ఫైర్ ఎందుకు మిస్ అవుతోంది అన్నది జనాలకు అర్థం కావడం లేదు.

తనను తాను ఒక ఛట్రంలో ఎందుకు బిగించేసుకుంటున్నారో తెలియడం లేదు. ఇదే ఫైర్ తన కథల్లో, మేకింగ్‌లో చూపించగలిగితే పూరి సినిమాల ఫలితాలే వేరుగా ఉంటాయన్నది స్పష్టం. మరి తన మ్యూజింగ్స్‌తో వేరే వాళ్లను ఇన్‌స్పైర్ చేయడమే కాదు.. తాను కూడా స్ఫూర్తి పొందితే బాగుండేమో పూరి.