పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుదీర్ఘ ప్రసంగమే చేశారు. అందులో అనేక అంశాలపై మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరిచింది.. చర్చనీయాంశంగా మారింది మాత్రం.. తమిళ సినీ పరిశ్రమ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే. తమిళ సినిమాల్లో తమిళు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమిళనాడు పరిధిలోనే షూటింగ్ చేయాలని సినీ పరిశ్రమలో ఈ మధ్య కొన్ని షరతుల మీద పవన్ మాట్లాడాడు.
ఇలా ఒక పరిధి పెట్టుకుంటే ఏ పరిశ్రమా ఎదగలేదని.. తెలుగు పరిశ్రమ అందరినీ అక్కున చేర్చుకుంది కాబట్టే ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగిందని.. ఇలాగే విశాల దృక్పథంతో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు వస్తాయని పవన్ పేర్కొన్నాడు. తమిళుడే అయిన దర్శకుడు సముద్రఖనిని పక్కన పెట్టుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొందరు తమిళ పీఆర్వోలు ఈ వ్యాఖ్యల గురించి పాజిటివ్‌గానే పోస్టులు పెట్టారు.
కానీ ఆత్మాభిమానం కొంచెం ఎక్కువగా ఉండే తమిళులు కొందరికి ఈ వ్యాఖ్యలు నచ్చట్లేదు. దీని మీద ఆల్రెడీ కొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వారూ లేకపోలేదు. ఐతే పవన్ రాజకీయ శత్రువులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళులది సంకుచిత మనస్తత్వం అని పవన్ వ్యాఖ్యానించాడని.. ఆ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడాడని అంటూ తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. ఏ చిన్న అవకాశం వచ్చినా అన్‌పాపులర్ చేయాలని చూసేవాళ్లు మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసైనికులు, పవన్ అభిమానులు.. వీరిని దీటుగానే ఎదుర్కొంటున్నారు. పవన్ వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates