20 ఏళ్ళ తర్వాత కల్ట్ క్లాసిక్  కొనసాగింపు

తెలుగులో వచ్చిన డెప్త్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్ లో 7జి బృందావన్ కాలనీది ప్రత్యేక స్థానం. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవికృష్ణ హీరోగా దీన్ని రూపొందించారు. 2004లో రిలీజైన ఈ కల్ట్ క్లాసిక్ వచ్చే ఏడాది రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా దీన్ని రెండో భాగం తీయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కథ ప్రకారం అందులో చనిపోతుంది కాబట్టి ఇప్పుడీ కొనసాగింపు కోసం అదితి శంకర్, యువానలతో పాటు మరో ఇద్దరు ముగ్గురితో చర్చలు జరుగుతున్నట్టు చెన్నై టాక్.

ఈ సినిమా తర్వాత రవికృష్ణ ఇంకొన్ని సినిమాలు చేశాడు కానీ అవేవి ఆడకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. తండ్రి రత్నంకు సైతం కొంత గ్యాప్ వచ్చింది. దీంతో గతంలో సీక్వెల్ కు డిమాండ్ ఉన్నా సరే పట్టించుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత మోక్షం దక్కనుంది. 7జి బృందావన్ కాలనీకి అద్భుతమైన సంగీతం అందించి దాని విజయంలో కీలక పాత్ర పోషించిన యువన్ శంకర్ రాజా ఈసారి కూడా ఆ బాధ్యతను తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ స్క్రిప్ట్ పనుల మీద ఉన్నట్టు సమాచారం. రవి పాత్రను ఎలా కంటిన్యూ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కానీ అంత పాత సినిమాకు ఇప్పుడు పార్ట్ 2 అంటే వ్యవహారం అంత ఆషామాషీగా ఉండబోదు. 7జి  బృందావన్ కాలనీకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. అప్పుడు రవికృష్ణ ఫ్రెష్ గా కనిపించిన కుర్రాడు కాబట్టి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నాలుగు పదుల వయసులో తనను లవర్ బాయ్ గా చూపించలేరుగా. ఒకవేళ పూర్తిగా ఫ్రెష్ స్టోరీని తీసుకుని కేవలం టైటిల్ క్రేజ్ ని వాడుకుని మార్కెటింగ్ చేస్తారేమో చూడాలి. అన్నట్టు ఒరిజినల్ 7జి బృందావన్ కాలనీని త్వరలో కొత్త రీమాస్టర్ ప్రింట్ తో మళ్ళీ విడుదల చేసేందుకు  నిర్మాత రత్నం రెడీ అవుతున్నారు.