రెండు ఫ్లాపులిచ్చినా ప్యాన్ ఇండియా సినిమా దక్కింది

ఒక్కోసారి కొందరు దర్శకులపై డిజాస్టర్ల ప్రభావం అంతగా పడదు. పై పెచ్చు అంతకన్నా మంచి ఆఫర్లతో లక్కీ ఛాన్స్ కొట్టేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణను చూస్తే అదే అనిపిస్తుంది. ఈయన గత చిత్రం ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సూపర్ డూపర్ ఫ్లాప్. సుధీర్ బాబు బోలెడు నమ్మకం పెట్టుకుంటే నీరుగారిపోయింది. కృతి శెట్టి డ్యూయల్ రోల్ చేసినా లాభం లేకపోయింది. దీనికన్నా ముందు నానిని నెగటివ్ షేడ్స్ లో చూపించిన వి ఫలితం కూడా అంతే. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబట్టి సేఫ్ అయ్యింది కానీ నేరుగా థియేటర్లకు వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.

అయినా సరే నిర్మాత దిల్ రాజుకు ఇంద్రగంటి మీద తగని గురి. అందుకే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ జటాయువుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన తెచ్చారు కానీ హీరో తదితర వివరాలు చెప్పలేదు. విజయ్ దేవరకొండ దీని పట్ల సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాజుగారి బ్యానర్ లోనే పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్(ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్న రౌడీ హీరోకు జటాయు కథ బాగా నచ్చిందట. బడ్జెట్ పరిమితులు లేకుండా నిర్మిస్తున్నారు కాబట్టి మంచి ఛాన్స్ అనుకుని ఓకే చెప్పినట్టు వినికిడి.

సో ఈ అవకాశాన్ని ఇంద్రగంటి ఎలా వాడుకుంటారో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాకుంతలం విషయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా మంచి గ్రాఫిక్స్ టీమ్ ని సెట్ చేసుకోమని దిల్ రాజు చెప్పారట. ప్రస్తుతం ఖుషి ప్రమోషన్లకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ సమాంతరంగా పరశురామ్, గౌతమ్ తిన్ననూరిలతో పని చేయనున్నాడు. జటాయుకి నిర్మాణానికి టైం పట్టేలా ఉంది కనక వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.