మొన్న అర్ధరాత్రి కల్కి 2898 టీజర్ వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ తో సహా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ప్యాన్ ఇండియా మూవీ గురించిన చర్చే జరుగుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద వచ్చిన నెగటివిటీ దాని వల్ల తగ్గిన మాట వాస్తవం. ఒక గొప్ప ఫాంటసీ వరల్డ్ లోకి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకెళ్లబోతున్నాడనే నమ్మకం ఆడియన్స్ లో వచ్చేసింది.
మహానటి లాంటి ఎమోషనల్ డ్రామా తర్వాత ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండియర్ ని ఎంచుకోవడం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పిట్టకథలుకు లింక్ ఏమిటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. రెండేళ్ల క్రితం వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రేక్షకులకు అంతగా గుర్తు లేదు కానీ అందులో నాలుగో ఎపిసోడ్ ఎక్స్ లైఫ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిందే. శృతి హాసన్ ప్రధాన పాత్ర.
37 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిన్న షార్ట్ మూవీలో ఇతను టచ్ చేసిన అంశాలు ఫ్యూచర్ లైఫ్, టెక్నాలజీనే. వర్చువల్ రియాలిటీ సాంకేతికత సగటు మనిషి జీవితంలో ఎలాంటి ముప్పు తీసుకొస్తుందో చూపించారు. అయితే కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు కాన్సెప్ట్ అర్థం కాక అయోమయానికి గురి చేయడంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది.
ఇప్పుడు కల్కి 2898 ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రమాదాలు వస్తాయోననే ఆలోచనతో తీస్తున్నదే. కాకపోతే ఎక్స్ లైఫ్ చోటా ఫిలిం కాబట్టి పరిమితుల మధ్య అవుట్ ఫుట్ తేడా కొట్టి ఉండొచ్చు కానీ ఆరు వందల కోట్లతో తీస్తున్న కల్కిలో నాగ్ అశ్విన్ ఏ చిన్న పొరపాటుకి ఆస్కారం ఇవ్వడు. కామిక్ కాన్ వేదిక మీద టీజర్ లాంచ్ జరగడం వల్ల దీనికి ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ కూడా వచ్చింది. మొత్తానికి కల్కి చర్చల్లోకి వచ్చిన తర్వాత మూవీ లవర్స్ వెనక్కు వెళ్లి మరీ పిట్టకథలులో నాగ్ అశ్విన్ ఎపిసోడ్ ఒక్కటే చూసేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం.