ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క బిచ్చగాడు తప్ప చెప్పుకోదగ్గ పెద్ద హిట్టు మరొకటి లేని విజయ్ ఆంటోనీ నిన్న హత్యతో థియేటర్లలో అడుగు పెట్టాడు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ ఎంతో కొంత వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ గురు ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్ర పోషించగా గుంటూరు కారం ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి కీలకమైన క్యారెక్టర్ దక్కించుకుంది. అయితే ఫలితం, టాక్, రివ్యూలు అన్నీ విజయ్ ఆంటోనీకి ప్రతికూలంగానే ఉన్నాయి.
ఇదో అరిగిపోయిన స్టోరీ లైన్. ప్రముఖ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) హత్యకు గురవుతుంది. ఇన్స్ పెక్టర్ సంధ్య(రితిక సింగ్)కు కేస్ ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక అయోమయపడుతుంటే డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) రంగంలోకి దిగి ఒక్కొక్కరిని విచారించడం మొదలుపెడతాడు. లైలాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళతో పాటు అందరినీ విచారిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో చిక్కుముళ్లు ఎదురవుతాయి. వాటిని దాటుకుని హంతకుడిని పట్టుకుంటాడు. ఎప్పటిలాగే పెద్దగా నటన అవసరం లేని పాత్రలో విజయ్ ఆంటోనీ సీరియస్ యాక్టింగ్ తో బండి లాగించాడు.
ఏ మాత్రం ఆసక్తి రేపని స్క్రీన్ ప్లేతో హత్య చాలా నీరసంగా సాగుతుంది. దానికి తోడు పంటి కింద రాళ్ళలా పాటలు అడ్డం పడితే స్లో నెరేషన్ కేవలం గంట లోపే ఉన్న ఫస్ట్ హాఫ్ సైతం విపరీతంగా బోర్ కొట్టేలా చేసింది. దాదాపు సినిమా మొత్తం రెండు మూడు ఇంటీరియర్ లొకేషన్లలో చుట్టేయడంతో బాగా విసుగొస్తుంది. నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. రాధికా శరత్ కుమార్, మురళి శర్మ, జాన్ విజయ్ లాంటి క్యాస్టింగ్ ని వేస్ట్ చేసుకున్నారు. ఓటిటిలో ఏదో ఫార్వార్డ్ చేసుకుంటూ ట్రై చేయోచ్చు కానీ రెండుంపావు గంటలు టికెట్ కొని భరించడం కష్టమే. బిచ్చగాడు హీరోకి మళ్ళీ నిరాశ తప్పలేదు.