బేబి.. ఇది కదా రికార్డంటే

వందల కోట్ల బడ్జెట్లు.. వందల కోట్ల వసూళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ చివరికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చిందన్నదే అత్యంత ప్రధానమైన విషయం. దాన్ని బట్టే ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అనేది తేలుతుంది. గత నెలలో రిలీజైన ‘ఆదిపురుష్’ సినిమాకు ఐదొందల కోట్ల బడ్జెట్ అని ఘనంగా చెప్పుకున్నారు. ఆ చిత్రం తొలి రోజే రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఇంకా ఘనంగా ప్రకటించుకున్నారు.

తీరా చూస్తే అదొక పెద్ద డిజాస్టర్ మూవీ అయింది. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర చతికిలపడి.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.40 కోట్ల దాకా నష్టం తెచ్చిపెట్టింది. కానీ గత శుక్రవారం రిలీజైన ‘బేబి’ అనే చిన్న సినిమా.. వీకెండ్ కూడా పూర్తి కాకముందే ‘బ్రేక్ ఈవెన్’ అయిపోవడం విశేషం. టాలీవుడ్ చరిత్రలోనే కాస్త పేరున్న సినిమాల్లో అత్యంత వేగంగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల్లో ఒకటిగా ‘బేబి’ నిలిచింది.

చాలా ఏరియాల్లో ఈ సినిమా రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆదివారం నుంచే లాభాల బాట పట్టింది. ఈ సినిమాను నిర్మాత రిలీజ్‌కు ముందు మంచి లాభాలకే అమ్ముకున్నాడు. ఆ సినిమా రేంజికి పెద్ద స్థాయిలోనే బిజినెస్ జరిగింది. నైజాం ఏరియా హక్కులను మూడు కోట్లకు అమ్మినట్లు సమాచారం. కానీ ఈ సినిమా ఈ ప్రాంతంలో వీకెండ్లో నాలుగు కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది.

అంటే వీకెండ్లోనే 25 శాతానికి పైగా లాభం అన్నమాట. ఈ సినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో నైజాం ఏరియాలో రూ.10 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వెళ్లేలా కనిపిస్తోంది. అంటే.. పెట్టుబడి మీద మూడు రెట్ల లాభం అన్నమాట. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతోందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాల విషయంలో బడ్జెట్లు, బిజినెస్‌లు, వసూళ్లు గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ.. లాభాల కోణంలో చూస్తే మాత్రం ఇలాంటి చిన్న సినిమాల ముందు అవి దిగదుడుపే.