శివ కార్తికేయన్ హీరోగా విడుదలైన మహావీరుడులో టైటిల్ రోల్ ఎవరిదంటే కథ ప్రకారం మాస్ మహారాజా రవితేజదే. అదేంటి అనుకోకండి. దీనికాయన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే నిర్మాతలు దాన్ని సరైన రీతిలో ప్రమోషన్ కి వాడుకోకపోవడంతో అభిమానులకు సైతం ఆలస్యంగా తెలిసొచ్చింది. మొదలైన గంట తర్వాత ఎంట్రీ ఇచ్చే ఆకాశవాణి రూపంలో చాలా సార్లు రవితేజ గొంతు రూపంలో వినిపిస్తూనే ఉంటాడు. పిరికివాడైన హీరోకి ధైర్యాన్ని నూరిపోస్తూ, విలన్ల మీదకే ఉసిగొలుపుతూ, సమయానికి తగిన సలహాలు ఇస్తూ ఒకరకంగా దేవుడి పాత్ర పోషించాడు.
చాలా డెప్త్ తో రవితేజ దీనికి డబ్బింగ్ చెప్పారు. అయితే దర్శకుడు అశ్విన్ సరైన రీతిలో సబ్జెక్టుని హ్యాండిల్ చేయలేకపోవడంతో ఫస్ట్ హాఫ్ కామెడీ ఓ మోస్తరుగా నెట్టుకొచ్చినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా దెబ్బేసింది. దీంతో క్రమం తప్పకుండా వినిపించే రవితేజ స్వరం ఒకదశ దాటాక ఈ సాగతీత వల్ల ఎలివేషన్ మిస్ అయ్యింది. లేదంటే ఇంకో లెవెల్ లో ఉండేది. స్నేహం కొద్దీ మాస్ రాజా చేసిన ఈ సహాయం మహావీరుడికి ఎంత లేదన్నా ప్లస్ అవుతోంది కానీ కథా కథనాలు ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. మంచి అవకాశాన్ని అశ్విన్ వృథా చేసినట్టే అయ్యింది.
ఇది పక్కనపెడితే మహావీరుడు ప్రమోషన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్ప ఇంకెలాంటి పబ్లిసిటీ చేయకపోవడంతో సాధారణ ప్రేక్షకులకు ఇదొచ్చిన సంగతే తెలియకుండా పోయింది. పైగా యూత్ ఎక్కువ అధిక శాతం బేబీ మీద ఆసక్తి చూపించడంతో ఓపెనింగ్స్ మీద కొంత దెబ్బ పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాంకేతిక కారణాల వల్ల మహావీరుడు ఉదయం షోలు సమయానికి మొదలుకాకపోవడం, క్యాన్సిల్ చేయడం మూలిగే నక్క మీద తాటిపండు వేసినట్టు అయ్యింది. ఏదైనా రాబట్టుకుంటే ఈ వీకెండ్ నే టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది.