సూపర్ చెప్పావు SKN

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్ లో ఉంటాయో నిత్యం చూస్తుంటాం. ఒక్కోసారి ఇవి శృతిమించి రోడ్ల మీద గొడవలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నిర్మాతో లేదా దర్శకుడో ఫలానా స్టార్ కి అభిమాని అయితే అతన్ని పర్సనల్ గా టార్గెట్ చేసిన ఉదంతాలు బోలెడు. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు. మంచి కన్నా చెడు వేగంగా ప్రచారమవుతుంది కాబట్టి ఇంకో కోణం గురించి తెలిసినవాళ్ళు తక్కువ. ఎల్లుండి విడుదల కాబోతున్న బేబీ నిర్మాత ఎస్కెఎన్ ఒక మంచి వివరణతో అసలు ఫ్యానిజం ఎలా ఉండాలో అనే దానికి ఉదాహరణ చెప్పారు.

మెగా ఫ్యామిలీ వీర ఫ్యాన్ గా ఎస్కెఎన్ గురించి తెలిసిందే. అలా అని ఇతర హీరోలను ఇష్టపడకపోవడమో లేదా ట్రోల్ చేయడమో లాంటి వ్యహహారాలు ఉండవు. ప్రభాస్, రవితేజ లాంటి వాళ్ళకు పిఆర్ గా చేసినప్పుడు ఆ ఇద్దరి ఫాలోయర్స్ తనను ఇష్టపడేవాళ్లు. నిర్మాతగా టాక్సి వాలా రిలీజ్ కు పైరసీకి గురైతే జంగారెడ్డిగూడెం నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఫోన్ చేస్తే ఇక్కడ సీడీలు చేసి అమ్ముతున్నారని దగ్గరుండి మరీ పట్టించాడు. అదేంటయ్యా నేను మెగా ఫాన్ అని తెలిసినా హెల్ప్ చేశావని ఎస్కెఎన్ అడిగితే అదేంటన్న మనమందరం తెలుగు హీరోల అభిమానులమేనని హత్తుకునేలా చెప్పాడు

అయినా ఒక హీరోని ప్రేమిస్తే మరో హీరోని ద్వేషించాలని లేదు. ఆ మాటకొస్తే ట్విట్టర్ లో గొడవలు చేసేవాళ్లంతా ఫేక్ ఐడిలతో తమ అసలు ఐడెంటిటీ దాచుకుని రెచ్చగొట్టేవాళ్ళే. ఆ మాటలకు, చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నుంచి విజయ్ దేవరకొండ దాకా ఎవరు ఎవరినైనా ఇష్టపడవచ్చు కానీ దానికి బదులుగా అవతలి వాళ్ళ మీద బురద జల్లడం కాదుగా. ఎస్కెఎన్ చెప్పిన మాటలు ఆలోచింపదగినవే. జీవితంలో చాలా విలువైన కాలాన్ని తమ హీరోల కోసం ఖర్చు పెట్టే యువత అది కేవలం ప్రేమకే పరిమితం చేయాలి తప్ప ఇంకెవరి మీదో ద్వేషం కోసం కాదు.