ప్రభాస్ హీరో అయింది ‘ఈశ్వర్’తో అయినా కానీ బ్రేక్ వచ్చింది ‘వర్షం’తోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యువతరానికి హార్ట్ త్రోబ్ అయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్‌తో ప్రభాస్‌కి మంచి అనుబంధం వుంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నాడు. తను నేను, పేపర్‌బోయ్ చిత్రాల్లో హీరోగా నటించిన సంతోష్ శోభన్‌కి హీరోగా బ్రేక్ రాలేదు.
దాంతో ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్‌లో అతడితో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టాడు. అందుకే అతని కోసమని యువి క్రియేషన్స్ ఒక చిన్న సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ దర్శకుడి నుంచి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుడి చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచనతో లిమిటెడ్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇది కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటిటి సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మరచిపోకుండా, అతను లేకపోయినా కానీ తన రుణం తీర్చుకుంటోన్న ప్రభాస్ నిజంగా డార్లింగే కదూ!