తెలుగు సినిమాని కమ్మేస్తున్న తమిళ సంగీతం

మ్యూజిక్ డైరెక్టర్ల కొరత టాలీవుడ్ ని మాములుగా వేధించడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల దర్శకులకు ఇదో పెద్ద సమస్యగా మారింది. తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ తప్ప ఆప్షన్ లేకుండా పోతోంది. అందుకే తమిళ మలయాళం నుంచి రెమ్యునరేషన్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నా సరే దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పోకడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అనిరుద్ రవిచందర్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 12 ఉన్నాయి. వీటి సిట్టింగ్స్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఒకటి ప్యాన్ ఇండియా మూవీ కాగా రెండోది భారీ బడ్జెట్ తో రూపొందుతోంది

జివి ప్రకాష్ కుమార్ ఏకంగా నాలుగు ప్రాజెక్టులు పట్టేశాడు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఆల్రెడీ పిచ్చ క్రేజ్ తో బిజినెస్ జరుపుకుంటోంది. నితిన్ – వెంకీ కుడుములు కాంబోకి ఏరికోరి మరీ తనను తీసుకున్నారు. వైష్ణవ్ తేజ్ ఆదికేశవకు పని పూర్తయ్యింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ చేయబోయే మూవీ కూడా ఇతని ఖాతాలోకే వచ్చింది. ఇక లెజెండరీ ఏఆర్ రెహమాన్ కు రామ్ చరణ్ 16తో పాటు నాగ చైతన్య – చందు మొండేటిల క్రేజీ మూవీ లాక్ అయినట్టే. హరీష్ జైరాజ్ ప్రస్తుతం నితిన్ – వక్కంతం వంశీలతో పాటు నాగ శౌర్య 24కి వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాదే రిలీజ్ అవుతాయి.

ఇటీవలే కస్టడీకి పని చేసిన యువన్ శంకర్ రాజా ఆల్రెడీ విశ్వక్ సేన్ 11కి ట్యూన్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. జిబ్రాన్ డిమాండ్ కూడా బాగానే ఉంది.  వీళ్ళందరూ ఇవి కాకుండా మరికొన్ని టాలీవుడ్ కమిట్ మెంట్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. మనకు అనూప్ రూబెన్స్, మిక్కీ జె మేయర్ లాంటి వాళ్ళు అందుబాటులో ఉన్నా పెద్ద ప్రాజెక్టులను డీల్ చేయడంలో తడబడుతున్నారు. మలయాళం నుంచి గోపి సుందర్, హేశం అబ్దుల్ వహాబ్ లు సైతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీన్ని బట్టే తెలుగు సినిమా మీద పర బాషా సంగీతం డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు