ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్-కే’ ఒకటి. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం అయితే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావచ్చు. ఇటీవలే ఈ ప్రాజెక్టులోకి లోక నాయకుడు కమల్ హాసన్ రావడంతో దీని స్కేల్ ఇంకా పెరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి చిత్రం రెడీ కాకపోవచ్చు.
వచ్చే ఏడాది వేసవిలో, లేదంటే ద్వితీయార్ధంలో రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐతే రిలీజ్ గురించి చర్చ ఎలా ఉన్నప్పటికీ ‘ప్రాజెక్ట్-కే’ అయితే తరచుగా వార్తల్లో ఉంటోంది. కమల్ హాసన్ సినిమాలో భాగమవ్వడం.. ఆ తర్వాత ‘కామిక్ కాన్’ నుంచి ఆహ్వానం అందుకోవడం.. అలాగే సినిమాకు సంబంధించి మెర్చండైజ్ అమ్మకాలతో సోషల్ మీడియాలో ‘ప్రాజెక్ట్-కే’ ట్రెండ్ అవుతూనే ఉంది.
మరోవైపు ‘ప్రాజెక్ట్-కే’ టైటిల్ విషయంలోనూ ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఇందులో ‘కే’ అంటే ఏంటనే విషయంలో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇందులో హీరో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు కాబట్టే టైటిల్లో ‘కే’ అని పెట్టారనే చర్చ నడిచింది ఇంతకుముందు. కానీ తాజా సమాచారం ప్రకారం ‘కే’కు ఇండికేషన్ అది కాదట. ‘కే’ అంటే ‘కాల చక్ర’ అని సమాచారం.
ఈ సినిమా టైం ట్రావెల్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాన్ని సూచించేలాగే ‘కాలచక్ర’ను షార్ట్ చేసి టైటిల్లో ‘కే’ అని పెట్టారని అంటున్నారు. ఇందులో హీరో చేపట్టే మిషన్ పేరు కూడా ‘ప్రాజెక్ట్ కాలచక్ర’ అని.. దాన్నే షార్ట్ చేసి ‘ప్రాజెక్ట్-కే’గా టైటిల్ ఖాయం చేశారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతోంది.