రెండు రోజుల ముందే భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘సలార్’ టీజర్. ప్రశాంత్ నీల్ చివరి సినిమా ‘కేజీఎఫ్-2’ టీజర్ చూసి ఊగిపోయిన ప్రేక్షకులు.. అదే దృష్టితో ఈ టీజర్ మీద అంచనాలు పెట్టుకున్నారు కానీ.. వాళ్లు ఆశించిన స్థాయిలో అయితే టీజర్ లేదన్నది వాస్తవం. అయినా సరే.. ఈ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అనేక రికార్డులు నెలకొల్పింది.
రెండు రోజుల వ్యవధిలోనే ‘సలార్’ టీజర్ వ్యూస్ ఏకంగా 100 మిలియన్ మార్కును దాటేశాయి. లైక్స్ కూడా రికార్డు స్థాయలో ఉన్నాయి. ఈ ఉత్సాహంలో ‘సలార్’ టీం ట్రైలర్ కబురు చెప్పేసింది. ‘సలార్’ ఫ్యాన్స్ అందరూ ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోవాలని.. ఆ నెలలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నామని ‘సలార్’ నిర్మాణ సంస్థ ‘హోంబలే’ ఫిలిమ్స్ అధికారికంగానే ప్రకటించింది. ‘సలార్’కు వచ్చిన రెస్పాన్స్ చూశాక తాము మరింత కష్టపడి పని చేసి ‘సలార్’ను ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు హోంబలే ఫిలిమ్స్ పేర్కొంది.
‘సలార్’ రిలీజ్ డేట్ సెప్టెంబరు 28 అన్న సంగతి తెలిసిందే. ఆ డేట్‌కే టీం కట్టుబడి ఉంది. మామూలుగా అయితే రిలీజ్‌కు రెండు మూడు వారాల ముందు ట్రైలర్ లాంచ్ చేస్తుంటారు. కానీ ‘సలార్’ రేంజే వేరు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. విదేశాల్లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటపుడు చాలా ముందుగానే ఔట్ పుట్ రెడీ చేయాలి.
అలాగే ప్రమోషన్ల హడావుడి కూడా పెంచాలి. అందుకే నెలన్నర ముందే ఫస్ట్ కాపీ తీయడమే కాక.. ట్రైలర్ కూడా రిలీజ్‌కు కనీసం నెల ముందే రిలీజ్ చేసేయబోతున్నారు. అప్పుడే కోరుకున్న స్థాయిలో హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ కొంత నిరాశ పరిచిన నేపథ్యంలో ట్రైలర్ విషయంలో ప్రశాంత్ నీల్ కచ్చితంగా జాగ్రత్త పడతాడనడంలో సందేహం లేదు. అసలు సినిమాలోని హైలైట్లను ట్రైలర్ కోసమే ప్రశాంత్ దాచుకుని ఉండొచ్చని కూడా భావిస్తున్నారు.