సామజవరగమన అనే చిన్న సినిమా వారం రోజుల నుంచి బాక్సాఫీస్ దగ్గర రేపుతున్న సంచలనం గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలకు ప్రేక్షకులను ఓ మోస్తరుగా కూడా థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైపోతున్న ఈ రోజుల్లో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు ఇరగాడేస్తుంటాయి. తమ స్థాయికి మించిన వసూళ్లు రాబడుతుంటాయి.
సామజవరగమన అలాగే వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. వారం తిరిగేసరికి 30 కోట్ల గ్రాస్.. దాదాపు 20 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. మంచి టాక్‌కు తోడు బాక్సాఫీస్ పరిస్థితులు కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. గత వారం దీనికి పోటీగా రిలీజైన సినిమాలేవీ నిలబడకపోవడంతో అడ్వాంటేజ్‌ను బాగా ఉపయోగించుకుంది. రెండో వారంలో కూడా ఈ సినిమాకు భలేగా కలిసొస్తోంది. వీక్ డేస్‌లో కొంచెం స్లో అయిన సామజవరగమన.. శుక్రవారం సాయంత్రం షోల నుంచి మళ్లీ బలంగా పుంజుకుంది.
ఇక శుక్రవారం పేరుకు చాలా సినిమాలే రిలీజయ్యాయి కానీ.. ఏవీ కూడా ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయాయి. మంచి క్రేజ్ సంపాదించిన నాగశౌర్య సినిమా రంగబలికి నెగెటివ్ టాకే వచ్చింది. తొలి రోజు వసూళ్లు బానే ఉన్నా.. సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్నది సందేహంగానే ఉంది. భాగ్ సాలే అయితే పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
జగపతిబాబు సినిమా రుద్రంగికి కూడా టాక్ బాగా లేదు. భాగ్ సాలే, రుద్రంగి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ లేవు. చాలా చోట్ల జనాల్లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. ఇక 7:11 పీఎం, సర్కిల్ లాంటి చిన్న సినిమాల గురించి ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండో వారంలో కూడా కొత్త సినిమాలను పక్కకు నెట్టి సామజవరగమననే బాక్సాఫీస్ లీడర్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు మామూలుగా కలిసి రావడం లేదనే చెప్పాలి.