అనిరుధ్ మీద దృష్టి పెట్టాల్సిందే  

సౌత్ నాలుగు భాషల సినీ పరిశ్రమల్లో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందున్న పేరు ఎవరయ్యా అంటే  మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పేది అనిరుద్ రవిచందర్ గురించే. కోలీవుడ్ లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్ లలోనూ మాములుగా లేదు. అటు పాటలు, ఇటు నేపధ్య సంగీతం రెండింటిలోనూ అదరగొట్టే ఈ యువ తరంగం చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇటీవలే తనవి రెండు ఆడియో సింగల్స్ బయటికొచ్చాయి. ఒకటి విజయ్ లియో, రెండు రజనీకాంత్ జైలర్. మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి కానీ ట్యూన్స్ మరీ ఎక్స్ ట్రాడినరీగా లేవని మ్యూజిక్ లవర్స్ రిపోర్ట్.

సరే మనకొచ్చిన చిక్కేమనుకుంటున్నారా. అనిరుద్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చేస్తున్నాడు. ఇంకా కంపోజింగ్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. ప్రాథమికంగా కొంత వర్క్ చేశారు కానీ అతని డేట్ల కోసం దర్శకుడు కొరటాల శివ వెయిటింగ్ లో ఉన్నాడు. వాటి రికార్డింగ్ పూర్తయ్యాకే సాంగ్స్ షూట్ ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉండటంతో దేవర సంగీతం విషయంలో రాజీ పడేందుకు హీరో, డైరెక్టర్ ఇద్దరూ సిద్ధంగా లేరు. అనిరుద్ గతంలో అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ లాంటివి చేసినా కూడా అవేవి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లా నిలవలేదు.

రెండోది విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూని కాంబోలో చేస్తున్నది. ఖుషి అయ్యాక విజయ్ దేవరకొండ ఇందులో పాల్గొంటాడు. పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్(ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణతో పాటు ఇది కూడా సమాంతరంగా జరుగుతుంది. గౌతమ్ తో ఆల్రెడీ జెర్సికి పని చేసిన అనిరుద్ ఈసారి ఎలాంటి స్కోర్ ఇస్తాడోనని రౌడీ హీరో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు అనిరుద్ కి తమిళ ప్రాజెక్టులకే టైం చాలడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ చెప్పిన రెండింటికి క్వాలిటీ సమయం ఇవ్వడం పెద్ద టాక్. ఒకరకంగా చెప్పాలంటే అది సదరు దర్శకులకే ఛాలెంజ్. ఎలా రాబట్టుకుంటారో మరి.