‘ఆర్ఆర్ఆర్’కు ఆ సమస్య ఉండదులే

సడక్-2.. రెండు రోజులుగా ఈ పేరు సోషల్ మీడియా మార్మోగుతోంది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అతి త్వరలోనే హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ కాబోతోందీ చిత్రం. ఈ నేపథ్యంలోనే దీని ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందనుకుంటే పొరబాటే. దాని మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత వల్లే అది చర్చనీయాంశం అవుతోంది.

ఏకంగా 80 లక్షల దాకా డిజ్ లైక్స్ పడ్డాయి ఈ ట్రైలర్‌కు. ప్రపంచంలోనే అత్యధిక డిజ్ లైక్‌లు తెచ్చుకున్న ట్రైలర్‌గా ఇది రికార్డు సృష్టించినట్లు కూడా చెబుతున్నారు. ఈ వ్యతిరేకతకు కారణమేంటో తెలిసిందే.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించింది ఆలియా భట్, సిద్దార్థ్ రాయ్ కపూర్ లాంటి నెపోటిజం బ్యాచే అని.. అలాగే రియా చక్రవర్తితో కలిసి సుశాంత్‌ను ఇబ్బంది పెట్టిన మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆ వ్యతిరేకతను కూడా జనాలు చూపిస్తున్నారని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో ఆలియా నటించే వేరే సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న మొదలైంది. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ కూడా చర్చల్లోకి వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆలియా ఓ కథానాయికగా నటిస్తున్న నేపథ్యంలో రేప్పొద్దున ఈ సినిమా విడుదల సమయంలోనూ ఉత్తరాది ప్రేక్షకుల్లో వ్యతిరేకత కనిపిస్తుందా.. దాన్ని కూడా బాయ్‌కాట్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఇంకో ఏడాది తర్వాతే వచ్చే అవకాశమున్న నేపథ్యంలో అప్పటికి సుశాంత్ మృతి తాలూకు ఎమోషన్ జనాల్లో ఉండదని.. పైగా ‘ఆర్ఆర్ఆర్’ను ఆలియా సినిమాగా భావించరని.. అది పక్కాగా రాజమౌళి సినిమా అని.. ‘సడక్-2’ విషయంలో ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకుడు కావడం వల్ల కూడా వ్యతిరేకత కనిపించిందని.. కాబట్టి దాని గురించి భయపడాల్సిన పనేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే ఆలియా పాత్రను పరిచయం చేసే టీజర్ మీద, అది కూడా అప్పటికింకా వేడి ఉంటే వ్యతిరేకత చూపించే అవకాశాలు మాత్రం కొట్టిపారేయలేం.