ప్రభాస్‌ బయ్యర్లకు మళ్లీ రిస్కే

ఈ ఏడాది అత్యధిక అంచనాలతో రిలీజవుతున్న సినిమా అంటే ‘సలార్’ అనే చెప్పాలి. ‘కేజీఎఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్ జట్టు కట్టాడంటే ఆ మాత్రం అంచనాలు లేకుండా ఎలా ఉంటాయి? ఇంకో మూడు నెలల్లోపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజే ‘సలార్’ టీజర్ కూడా లాంచ్ చేశారు. దాని విషయంలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. సినిమా మీద అంచనాలేమీ తగ్గే పరిస్థితి లేదు.

ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. ఈ క్రేజ్ చూసుకునే బిజినెస్‌ను కొండెక్కించేస్తోందట నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్. ‘కేజీఎఫ్’ రెండు భాగాలతో ఊహించని స్థాయిలో లాభాలు అందుకుని దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా అవతరించిన హోంబలె.. ప్రశాంత్ నీల్-ప్రభాస్‌ కలయికను కూడా బాగా క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం.

‘సలార్’కు సంబంధించి కేవలం థియేట్రికల్ హక్కులతో రూ.600 కోట్లకు పైగా ఆదాయాన్ని టార్గెట్ చేస్తోందట హోంబలె ఫిలిమ్స్.తెలుగు రాష్ట్రాలకు మాత్రమే హక్కులను రూ.200 కోట్లు చెబుతున్నారట. నైజాం ఏరియాకు రూ.80 కోట్లు, ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.120 కోట్లు కోట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐతే ‘సలార్’కు ఎంత క్రేజ్ ఉన్నా సరే.. ఈ రేట్లు టూమచ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఆదిపురుష్’ సినిమాకు రూ.160 కోట్ల మేర హక్కులు తీసుకుని రిలీజ్ చేసిన పీపుల్స్ మీడియాకు పెద్ద ఎత్తున నష్టాలు తప్పలేదు. ఆ సినిమాకు హైప్ తక్కువేమీ లేదు. వీకెండ్ వరకు బాగా పెర్ఫామ్ చేసినా.. పెద్ద మొత్తంలో నష్టాలు తెచ్చిపెట్టింది.

అలాంటిది ఏకంగా రూ.200 కోట్ల షేర్ రాబట్టాలంటే చిన్న విషయం కాదు. అసలే ప్రభాస్ చివరి మూడు సినిమాలు బయ్యర్లను ముంచేశాయి. ప్రభాస్ అంటేనే బయ్యర్లు భయపడే పరిస్థితి ఉంది. అలాంటిది తెలుగు రాష్ట్రాల వరకు ‘సలార్’తో ఏకంగా రూ.200 కోట్ల షేర్, రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టాలంటే ప్రభాస్‌కు అది మోయలేని భారమే అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, అన్నీ కలిసొస్తే బ్రేక్ ఈవెన్ కష్టం కాకపోవచ్చు కానీ.. ఏదైనా తేడా వస్తే మాత్రం బయ్యర్లు నిండా మునిగినట్లే.