స్క్రీన్లు చింపేంత అత్యుత్సాహం ఎందుకు

ఎప్పుడో ఆడేసి వెళ్ళిపోయిన బ్లాక్ బస్టర్లు మళ్ళీ రీ రిలీజ్ రూపంలో థియేటర్లకు వచ్చినప్పుడు అభిమానులకు ఉత్సాహం కలగడం సహజం. కానీ అది హద్దుల్లో ఉండాలి. ఏ మాత్రం శృతి తప్పినా నష్టం లక్షల్లో ఉంటుంది. దీని వల్ల సదరు యాజమాన్యాలు మరోసారి భవిష్యత్తులో పాత సినిమాలంటే వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టే పరిస్థితి వస్తుంది. నిన్న రాత్రి తొలిప్రేమ ప్రదర్శిస్తున్న విజయవాడ కపర్ది హాలులో షో రన్ అవుతుండగానే కొందరు ఫ్యాన్స్ మితిమీరిన అల్లరి మైకంలో ఏకంగా తెరను చింపేశారు. దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడున్న టెక్నాలజీలో ఫోర్ కె స్క్రీన్లు చాలా ఖరీదైన వ్యవహారం. తిరిగి కొత్తవి అమర్చాలంటే చిన్న రిపేర్లకు రెండు మూడు లక్షల నుంచి పాతిక లక్షల దాకా ఎంతైనా ఖర్చు కావొచ్చు. జరిగిన డ్యామేజ్ ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. తాగిన మత్తులో ఇలా ప్రవర్తించడం వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందనే విషయం మర్చిపోకూడదు. యాంటీ ఫ్యాన్స్ దీన్ని ట్రోలింగ్ కు వాడుకునే ప్రమాదం ఉంది. ఆ మధ్య ప్రభాస్ బిల్లా టైంలోనూ ఒక హాలు మధ్యలో బాణాసంచా కాల్చడం తీవ్ర భయాందోళనకు దారి తీసింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి
.
కొన్ని నెలల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లో రీ రిలీజులు చేయకూడదని తీర్మానించుకున్నారు. కానీ అభిమానుల విన్నపం మేరకు ఉపసంహరించుకున్నారు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల ఇకపై పెద్ద హీరోలవి తీసుకోవాలంటేనే వణికే పరిస్థితి వస్తుంది. అసలే సింగల్ స్క్రీన్లు మల్టీ ప్లెక్సులుగా, కల్యాణ మండపాలుగా మారుతున్న ట్రెండ్ లో ఉన్న కొన్నింటిని కాపాడుకోవాల్సింది మూవీ లవర్సే. కానీ ఇలా తెగబడి విధ్వంసాలకు పాల్పడితే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆనందం ఎప్పటికీ నాశనానికి దారి తీయకూడదు. ఇది పాటించడం చాలా అవసరం 

Show quoted text