ఎన్టీఆర్-ఏఎన్నార్-కృష్ణల జోరు తగ్గాక తెలుగు సినిమాల్లో నంబర్ వన్ స్థానాన్ని అధీష్టించిన మెగాస్టార్ చిరంజీవి.. 2007లో సినిమాలకు గుడ్ బై చెప్పేవరకు ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఒకసారి చిరు నంబర్ వన్ అయ్యాక మరే హీరో కూడా ఆయన దరిదాపుల్లోకి రాలేదు.
చిరు రిటైరయ్యే సమయానికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఒక రేంజ్‌కి ఎదిగినప్పటికీ.. చిరు స్థానం చిరుదే. స్వయంగా మహేష్ బాబే.. చిరునే ఎప్పుడూ నంబర్ వన్ అని, అది మాత్రమే కాదు.. తొలి పది స్థానాలు ఆయనవే అని అన్నాడు ఓ సందర్భంలో. ఐతే అలా అన్న మహేష్ ఇప్పుడు ఓ సర్వేలో చిరును వెనక్కి నెట్టి టాలీవుడ్ హీరోల్లో అగ్ర స్థానం సంపాదించాడు. ఇందులో చిరు ఆరో స్థానానికి పరిమితం కావడం గమనార్హం.
ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ ఇటీవల టాలవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్డమ్ ట్రాకింగ్ మొదలుపెట్టింది. వాళ్లు నిర్వహించిన సర్వే ప్రకారం టాలీవుడ్లో నంబర వన్ హీరోగా మహేష్ బాబు నిలవడం విశేషం. మిగతా హీరోలతో పోలిస్తే అత్యధిక పాయింట్లు మహేష్‌కే దక్కాయి. ఇక ఈ జాబితా మొత్తం చూస్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు మూడో స్థానం దక్కింది.
పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానం సంపాదించగా.. మెగాస్టార్ ఆరో స్థానంలో నిలిచారు. ఆయన తనయుడు రామ్ చరణ్‌కు ఏడో స్థానం దక్కింది. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రవితేజ లాంటి స్టార్లకు టాప్-10లో స్థానం దక్కలేదు. నేచురల్ స్టార్ నాని ఎనిమిదో స్థానంలో నిలవడం విశేషం. తొమ్మిదో స్థానం విజయ్ దేవరకొండ దక్కించుకోగా.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కచ్చితత్వం ఎంత.. ఏ ప్రమాణాలతో ఈ లిస్ట్ తయారు చేశారన్నది వెల్లడి కాలేదు. కాబట్టి ఈ జాబితా ఎంత వరకు రీజనబుల్ అన్నది హీరోల అభిమానులే ఆలోచించుకోవాలి.