చనిపోయిన మూడేళ్ళకు సినిమా విడుదల

చనిపోయాక కూడా దశాబ్దాల తరబడి జనం హృదయాల్లో బ్రతికుండే అదృష్టం ఒక్క సినిమా వాళ్ళకే దక్కుతుంది. నిత్యం టీవీల్లో థియేటర్లలో ఏదో ఒక ఒక రూపంలో ఆయా నటీనటుల జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో అన్నీ రిలీజైనవే ఉంటాయి. కానీ కొన్ని మాత్రం దురదృష్టశాత్తు రకరకాల కారణాల వల్ల ల్యాబ్ లో మగ్గిపోయి ఎప్పుడో మోక్షం దక్కించుకుంటాయి. ఆ మధ్య అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతిబింబాలు నలభై సంవత్సరాల తర్వాత వెలుగు చూస్తే కన్నడ దర్శకుడు తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చివరి చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అభిమానులకూ అలాంటి కానుక ఒకటి రాబోతోంది. ఈయన లాస్ట్ మూవీ అప్నో సే బెవఫాయి ఎల్లుండి 29న రిలీజ్ కాబోతోంది. ఏళ్ళ తరబడి దీనికి మోక్షం దక్కలేదు. ఇర్ఫాన్ చనిపోయింది 2020లో. అప్పటి నుంచి దీన్ని ఎన్నిసార్లు బయటికి తీసుకురావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. నటుడవ్వాలనే కోరికతో ముంబైకి వచ్చిన వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడం కోసం వ్యాపారాలు మొదలుపెడతాడు. అయితే ఈ క్రమంలో తన కుటుంబంతో పాటు చాలా వాటిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఈజీ మనీ తెచ్చే  ప్రమాదాలను ఇందులో చూపించారు

ప్రకాష్ బలేకర్ దర్శకత్వం వహించిన ఈ అప్నోసే బేవఫాయిలో భారీ తారాగణం లేదు కానీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్లు బలంగా ఉంటాయట. మహేష్ బాబు సైనికుడుతో ఇర్ఫాన్ ఖాన్ మనకూ పరిచయమే. అది డిజాస్టర్ కావడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు. హిందీ చిత్రాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఇర్ఫాన్ ఎంత టాలెంటెడ్ నటుడో అర్థమవుతుంది. ముఖ్యంగా హిందీ మీడియం, తల్వార్, లైఫ్ అఫ్ ఫ్రై లాంటివి చాలా పేరు తీసుకొచ్చాయి. హాలీవుడ్ మూవీ ఇన్ఫెర్నోలో అవకాశం వెతక్కుంటూ వచ్చింది. మరి బాక్సాఫీస్ పై ఇర్ఫాన్ చివరి సంతకం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి