కమల్ సీన్‌ను టరాంటినొ కాపీ కొట్టిన వేళ..

హాలీవుడ్ సినిమాల్లో సన్నివేశాల్ని మన వాళ్లు చడీచప్పుడు లేకుండా కాపీ కొట్టి పెట్టేయడం మామూలే. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మురుగదాస్ లాంటి మేటి దర్శకులు హాలీవుడ్ నుంచి సన్నివేశాలు, కథలు ఎత్తుకొచ్చి తమ సినిమాల్లో పెట్టేసిన వాళ్లే. కానీ మన సినిమాల్లో సన్నివేశాల్ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టడం అన్నది అరుదైన విషయం. అందులోనూ క్వెంటిన్ టరాంటినొ లాంటి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓ సౌత్ సినిమాలోని సన్నివేశం చూసి ఇన్‌స్పైర్ అయి అలాంటి సన్నివేశాన్ని తన సినిమాలో పెట్టాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. లోకనాయకుడు కమల్ హాసన్ విషయంలో ఇలా జరిగిందట.

కమల్ సినిమాల్లోకి అడుగు పెట్టి 61 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆయన కెరీర్లోని ఉత్తమోత్తమ చిత్రాలు, నోస్టాల్జిక్ మూమెంట్స్‌ను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కమల్ ఓ సందర్భంలో తన సినిమా సన్నివేశాన్ని చూసి క్వెంటిన్ టరాంటినొ ఇన్‌స్పైర్ అయిన విషయాన్ని వెల్లడించాడు. కమల్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి.. అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయిన ‘అభయ్’ సినిమా గుర్తుందా? అందులో ఒక యానిమేషన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.

అది చూసి క్వెంటిన్ టరాంటినొ ఇన్‌స్పైర్ అయి.. ‘కిల్ బిల్’ సినిమాలో అలాంటి సీక్వెన్స్ పెట్టాడట. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కమల్‌కు వెల్లడించాడట. ఓ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినపుడు క్వెంటిన్ టరాంటినొ కలిసి భారతీయ సినిమాల గురించి మాట్లాడుంటే.. దీని గురించి క్వెంటిన్ టరాంటినొ వెల్లడించినట్లు అనురాగ్ తనకు చెప్పినట్లు కమల్ వెల్లడించడం విశేషం. ‘అభయ్’కు కథ, స్క్రీన్ సమకూర్చింది కమలే అన్న సంగతి తెలిసిందే. సురేష్ కృష్ణ ఆ చిత్రానికి దర్శకుడు.

All the Streaming/OTT Updates you ever want. In One Place!