కరోనా టైంలో అనేక షాకులు తింది బాలీవుడ్. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. కరోనా వల్ల సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ప్రాణాలు వదిలాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా మరికొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటమూ ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ ఆయన కోలుకుని మామూలు మనిషి అయ్యారు.
కానీ ఇంతలో సంజయ్ దత్ ఆసుపత్రి పాలవడం ఆందోళన రేకెత్తించింది. ఆయనకు కరోనా లేదని తేలడంతో హమ్మయ్య అనుకున్నారంతా. కానీ తర్వాత వచ్చిన అప్ డేట్ చూసి కరోనా ఉన్నా పోయేదే అనిపిస్తోంది.
సంజయ్ దత్ ఊపిరి తిత్తుల క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. అది కూడా అడ్వాన్స్ (మూడో దశ) స్టేజ్. అంటే సంజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లే. ఈ దశలో ఊపిరి తిత్తుల క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు మనిషి కావడం అంత తేలిక కాదు. ఆయన వెంటనే అమెరికాకు పయనమవుతున్నారు. మళ్లీ ఎప్పటికి కోలుకుంటాడో.. సంజు భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. దీంతో ఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాలన్నీ సందిగ్ధంలో పడిపోయాయి.
ఇంతకుముందు సంజు జైలుపాలైనపుడు ఇలాగే చాలా సినిమాలు అన్యాయం అయిపోయాయి. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్-చాప్టర్ 2’లో సంజు విలన్గా చేస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఇది కాక బాలీవుడ్లో మూణ్నాలుగు సినిమాల్లో సంజు నటిస్తున్నాడు. వీటి పరిస్థితి ఏమవుతుందో చూడాలి మరి.