మెగా ఫ్యామిలీ ఇప్పుడు మామూలు ఆనందం లేదు. రామ్ చరణ్‌ను తండ్రిగా చూడాలని దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. చరణ్ భార్య ఉపాసన మూడు రోజుల కిందటే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజంతా మీడియాలో ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి దగ్గర హడావుడి కాస్త తగ్గాక శుక్రవారం ఉపాసనను డిశ్చార్జి చేశారు.
చరణ్ తన బిడ్డను, భార్యను వెంటబెట్టుకుని ఆసుపత్రి బయటికి వచ్చి మీడియాతో కొన్ని మాటలు మాట్లాడారు. పాప తన లాగే ఉందని చరణ్ అమితానందంతో చెప్పాడు. ఆడబిడ్డకు తండ్రి పోలిక ఉంటే అదృష్టం అని అంటారు. ఈ నేపథ్యంలోనే చరణ్ పాప తనలాగే ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు మీడియాతో. తన బిడ్డ మీద అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమకు ధన్యుడినని చరణ్ అన్నాడు.
ఒక తండ్రిగా తనకు ఇంతకంటే ఆనందం ఏం ఉంటుందని.. తన తండ్రి కూడా చాలా సంతోషంగా ఉన్నారని చరణ్ తెలిపాడు. అపోలో వైద్యులు ఉపాసనను, పాపను చాలా బాగా చూసుకున్నారని.. వాళ్లందరికీ ధన్యవాదాలని చరణ్ చెప్పాడు. తమ పాపకు ఏం పేరు పెట్టాలనే విషయంలో తాను, ఉపాసన ఇప్పటికే ఒక మాట అనుకున్నామని.. ఐతే ఇప్పుడే తన పేరు వెల్లడించబోనని.. తర్వాత ప్రకటిస్తానని చరణ్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates