ప్రభాస్.. అప్పుడా రికార్డులు, ఇప్పుడీ రికార్డులు

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పేరిట చాలా రికార్డులే నమోదయ్యాయి. బిజినెస్, కలెక్షన్లు.. రాజమౌళి అండతో ఇలా ప్రతి విషయంలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు ప్రభాస్. ఆ తర్వాతి సినిమాలకు ‘బాహుబలి’ బాగానే ఉపయోగపడింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగింది. ప్రభాస్ అంటే వందల కోట్ల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు అనే రేంజికి వెళ్లిపోయాడు. ఐతే ఈ విషయంలో రికార్డులు నెలకొల్పుతూనే.. నష్టాల విషయంలోనూ అతను కొత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంటున్నాడు.

సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. రెండూ ఒక్కోటి వంద కోట్లకు తక్కువ కాకుండా నష్టాలు తెచ్చిపెట్టాయి. ‘ఆదిపురుష్’ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చినా.. తొలి రోజు, తొలి వీకెండ్ వరకు భారీగానే వసూళ్లు రాబట్టినా.. చివరికి ఇది డిజాస్టర్‌గానే నిలుస్తోంది.

వీకెండ్ అవ్వగానే దబేల్‌మని కింద పడ్డ ‘ఆదిపురుష్’ తర్వాత పైకి లేచే సంకేతాలే కనిపించడం లేదు. రోజు వారీ గ్రాస్, షేర్ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సినిమా స్థాయికి అవి నామమాత్రం. ఈ వారాంతంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోయినా.. ‘ఆదిపురుష్’ పెద్దగా ఉపయోగించుకునేలా కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.170 కోట్ల మేర షేర్, రూ.330 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది.

కానీ ఇంకో 70 కోట్ల షేర్, రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ ఈ వీకెండ్ అయ్యేసరికి ఇంకో పది కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వస్తే ఎక్కువేమో. ఈ సినిమా రిలీజైనపుడు తొలి రోజే వంద కోట్ల వసూళ్ల మార్కు దాటిన సినిమాలు ప్రభాస్ కెరీర్లో నాలుగున్నాయని.. ఇదో రికార్డని ఘనంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే వరుసగా మూడో సినిమాతోనూ వంద కోట్ల నష్టం తెచ్చిపెడుతున్నాడు ప్రభాస్. ఇది చూసి అయినా ప్రభాస్ కొంచెం పరిమిత బడ్జెట్లలో సినిమాలు చేసి నిర్మాతలు, బయ్యర్లకు లాభాలు తేవడం గురించి ఆలోచించాలి.