జనసేనాని పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడందరికీ అర్థం అవుతోంది. పార్ట్ టైం పొలిటీషియన్‌గా ముద్ర పడ్డ పవన్.. జనసేనకు సరిపడా సమయం కేటాయించడం లేదని.. జనాల్లో అవసరమైన మేర తిరగట్లేదని.. అవి చేస్తే పార్టీ స్థాయే మారిపోతుందని గ్రౌండ్ రియాలిటీ తెలిసిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆంతరంగిక సంభాషణల్లో అభిప్రాయపడుతుంటారు.
కానీ సినిమా కమిట్మెంట్ల వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు.. ఇప్పటిదాకా రాజకీయ కార్యక్రమాలకు ఆశించిన స్థాయిలో అవసరమైన మేర సమయం ఇవ్వలేదనే చెప్పాలి. ఎప్పుడో మొదలు కావాల్సిన వారాహి యాత్ర కూడా ఆలస్యం అయింది. ఐతే ఆలస్యం అయితే అయ్యింది కానీ.. వారం కిందట మొదలుపెట్టిన వారాహి యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది. పవన్ రంగంలోకి దిగాడో లేదో.. ఏపీ రాజకీయాల్లో ఆయనే హాట్ టాపిక్ అయ్యారు. మీడియా సహా అన్ని చోట్లా ఆయనే హైలైట్ అవుతున్నారు. టీడీపీ సైడ్ అయింది. వైసీపీ మెయిన్ టార్గెట్ పవనే అయ్యాడు.
ఇక వారాహి యాత్రలో పవన్ ప్రసంగాలు, స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తోటి హీరోల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభాస్, మహేష్ బాబు తనకంటే పెద్ద హీరోలని.. ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ అయ్యాడని.. బాలకృష్ణ అంటే ఇష్టమని.. ఇలా నాన్-మెగా హీరోల గురించి చాలా సానుకూలంగా పవన్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇగో లేకుండా అందరినీ పొగడ్డంతో పవన్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా పవన్ అభిమానులతో సోషల్ మీడియాలో నిత్యం గొడవలు పెట్టుకుంటూ.. జనసేన మీద వ్యతిరేకత పెంచుకునే ఇతర హీరోల అభిమానుల్లో ఈ వ్యాఖ్యలు ఆలోచనకు దారి తీశాయి. స్వయంగా ఆయా హీరోల ఫ్యాన్ పేజీలను నడిపే అడ్మిన్స్.. పవన్ గురించి సానుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఫ్యాన్ వార్స్ కట్టి పెట్టాలని.. పవన్‌కు మద్దతు ఇవ్వాలని.. సినిమాలను, రాజకీయాలను వేరుగా చూడాలని పిలుపునిస్తున్నారు. ఈ ఒక్క మాటతో మొత్తం మారిపోయిందని చెప్పలేం కానీ.. అభిమానుల్లో ఒక ఆలోచన మొలకెత్తి పవన్ పట్ల సానుకూలంగా స్పందిస్తుండటం మాత్రం మంచి పరిణామం. ఇది పవన్‌కు కలిసొచ్చేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates