నిఖిల్ సినిమాకు భలే కలిసొస్తోందిగా..

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్దార్థ కొత్త చిత్రం స్పై ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ఈ నెల 29న రిలీజ్ చేసే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డిచినప్ప‌టికీ.. చివ‌రికి ఆ డేట్‌కే టీం క‌ట్టుబ‌డింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్ల‌కు స‌మ‌యం స‌రిపోదంటూ సినిమాను వాయిదా వేయాల‌ని ఒక ద‌శ‌లో ప‌ట్టుబ‌ట్టిన హీరో నిఖిల్.. చివ‌రికి నిర్మాత రూట్లోకే వ‌చ్చాడు.

29న రిలీజ్‌కే ఓకే చెప్పాడు. ఆ స‌మ‌యానికి సినిమాను సిద్ధం చేసేందుకు టీం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. రిలీజ్ వీక్‌లోకి అడుగు పెట్టాకే ప్ర‌మోష‌న్లు చేయ‌బోతున్నాడు నిఖిల్. ప్ర‌స్తుతానికి సినిమాకు మ‌రీ హైపేమీ లేక‌పోయినా.. రిలీజ్ టైంకి రావాల్సిన బ‌జ్ అంతా వ‌చ్చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రిస్థితులైతే బాగా అనుకూలంగానే క‌నిపిస్తున్నాయి.

స్పై మూవీకి ఆదిపురుష్ రూపంలో ఉన్న అతి పెద్ద అడ్డంకి తొల‌గిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం వీకెండ్ వ‌ర‌కే సందడి చేయ‌గ‌లిగింది. సోమ‌వారం నుంచి డివైడ్ టాక్ గ‌ట్టిగానే దెబ్బ కొడుతోంది. వీక్ డేస్‌లో సినిమా గురించి పెద్ద‌గా సౌండ్ లేదు. మ‌హా అయితే రెండో వీకెండ్లో ఆదిపురుష్ కొంత సంద‌డి చేయొచ్చు. ఆ త‌ర్వాత అయితే ఎవ‌రూ ఈ చిత్రాన్ని ప‌ట్టించుకునే అవ‌కాశం లేదు.

ఈ సినిమాకు ఉన్న హైప్‌కి పాజిటివ్ టాక్ వ‌చ్చి ఉంటే కొన్ని వారాల పాటు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టేది. వేరే చిత్రాల వైపు జ‌నం చూసేవారు కాదేమో. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఆదిపురుష్ నిరాశ ప‌రిచిన నేప‌థ్యంలో త‌ర్వాతి క్రేజీ సినిమా అయిన స్పై కోసం ప్రేక్ష‌కులు ఎదురు చూస్తారు. తెలుగులో సినిమాకు మంచి హైపే రావ‌చ్చు. టాక్ బాగుంటే ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమా స‌త్తా చాట‌వ‌చ్చు. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రొడ్యూస్ చేయ‌డ‌మే కాదు.. దీనికి స్క్రిప్టు కూడా అందించాడు.