కొందరు హీరోల సంగీత దర్శకుల కాంబినేషన్లు భలే కుదురుతాయి. ఒకటి రెండు హిట్లు పడగానే కొన్ని సంవత్సరాల పాటు అలాగే కొనసాగిస్తారు. ఇళయరాజా, రెహమాన్ లకు ఇలాంటి కలయికలు చాలానే ఉన్నాయి. అయితే ఎంఎం కీరవాణి – చిరంజీవికి మాత్రం ఎందుకో ఎక్కువసార్లు కాంబో రాలేదు. వీళ్లిద్దరి ఫస్ట్ కాంబినేషన్ ఘరానా మొగుడు. ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ బ్లాక్ బస్టర్ అప్పట్లో మ్యూజికల్ గానూ పెద్ద సెన్సేషన్. దీని తర్వాతే కీరవాణికి మాస్ ఎంటర్ టైనర్లు క్యూ కట్టాయి. ఆపద్బాంధవుడు ఆల్బమ్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంది కానీ కమర్షియల్ ఫలితం డిజాస్టర్
చివరిసారి చేతులు కలిపింది 1994లో వచ్చిన ఎస్పి పరశురాంతో. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. పాటలు కూడా సోసోగానే వెళ్లాయి. ఆ తర్వాత మెగాస్టార్ పూర్తిగా కోటి, మణిశర్మల వైపు షిఫ్ట్ అయిపోవడంతో తిరిగి ఇంకో సినిమా కుదరలేదు. తిరిగి ఇప్పుడు చిరు కోసం కీరవాణి సంగీతం ఇవ్వబోతున్నారని టాక్. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే ఫాంటసీ సబ్జెక్టుకి ఆయనైతే న్యాయం చేయగలరని భావించి ఆ మేరకు ఫైనల్ చేసినట్టు వినికిడి. అఫీషియల్ ప్రకటన రావటానికి టైం పట్టొచ్చు.
ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిపోయిన కీరవాణితో అంటే చిరంజీవి నో అని ఎలా అంటారు. పైగా ఇంత గ్యాప్ తర్వాత అంటే ఖచ్చితంగా అంచనాలతో పాటు అవుట్ ఫుట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ముల్లోక వీరుడు టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ని భోళా శంకర్ రిలీజయ్యాక ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా వెల్లడించే అవకాశాలున్నాయి. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన మూవీతో పాటు దీన్ని సమాంతరంగా షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తారట. రెండూ వచ్చే ఏడాది రిలీజయ్యేలా సెట్ చేసుకుంటున్నారు